మృత్యు రహదారి!
ABN , Publish Date - Jun 16 , 2025 | 12:37 AM
కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ఉన్న పోర్టు రోడ్డులో వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు నియంత్రణ చర్యలపై దృష్టి సారించారు.

పోర్టు రోడ్డులో ప్రమాదాల నియంత్రణపై దృష్టి సారించిన పోలీసులు
వరుస ప్రమాదాలకు కారణాలను గుర్తించి సరిదిద్దేందుకు కసరత్తు
విశాఖపట్నం, జూన్ 15 (ఆంధ్రజ్యోతి):
కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలానగర్ వరకు ఉన్న పోర్టు రోడ్డులో వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు నియంత్రణ చర్యలపై దృష్టి సారించారు. రోడ్డు ప్రమాదాలకు కారణం ఏమిటనే దానిని గుర్తించి, సరిదిద్దడం ద్వారా ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. సింధియా నుంచి ద్విచక్ర వాహనంపై నగరంలోకి వస్తున్న నేవీ ఆస్పత్రి వైద్యుడు, స్టాఫ్ నర్సు శనివారం ఎస్‌ఆర్ కంపెనీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై ట్యాంకర్ కింద పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 24 గంటలు కూడా గడవక ముందే ఇదే మార్గంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న నవదంపతులు మారుతి సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత వారం మారుతి సర్కిల్ వద్దే ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. తరచూ ఒకేచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసలు ప్రమాదాలకు కారణం ఏమిటనే దానిని గుర్తించాలని సీపీ శంఖబ్రత బాగ్చి ట్రాఫిక్ పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో హార్బర్, గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఆదివారం పోర్టు రోడ్డును పరిశీలించి రహదారి పరిస్థితిని పరిశీలించినట్టు సమాచారం. పోర్టు రోడ్డులో నిత్యం ధూళి ఎగిసిపడుతుండడంతో అది రోడ్డుమీద పడి జిడ్డులా తయారవుతోంది. చిన్నపాటి చినుకులు పడినా ఆ జిడ్డు కారణంగా ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాల టైర్లు స్కిడ్ అవుతున్నాయి. వాహనం ఒక లైన్‌లో వెళుతుందని డ్రైవర్ భావించినా, వాహనం వెళుతున్నపుడు రోడ్డుపై గల జిడ్డు కారణంగా కాస్త అటూఇటూ ఊగుతూ వెళుతున్నట్టు పోలీసులు గుర్తించినట్టు తెలియవచ్చింది. పైగా పోర్టు నుంచి రాకపోకలు సాగించే భారీ వాహనాల డ్రైవర్లు నిర్లక్ష్యంగా వాహనాలను నడపడం వల్ల ద్విచక్ర వాహనదారులు ముందుకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారని, అలాగని భారీ వాహనం వెనుక వెళ్లలేక, ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించి ప్రమాదాలకు గురవుతున్నట్టు కూడా ట్రాఫిక్ పోలీసులు అంచనాకు వచ్చినట్టు తెలియవచ్చింది. పోర్టు రోడ్డు విస్తరణ పనుల కారణంగా రోడ్డు పొడవునా మట్టి పేరుకుపోవడంతో వాహనాలు స్కిడ్ అయ్యేందుకు కారణంగా మారుతోందని ట్రాఫిక్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై పోర్టు రోడ్డును తరచూ శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటే తప్ప ప్రమాదాలకు అడ్డుకట్ట పడే అవకాశం లేదని ఉన్నతాధికారులకు నివేదించాలని ట్రాఫిక్ విభాగంలోని అధికారులు నిర్ణయానికి వచ్చారు.
ఫొటోలు:
15ఎంఎల్‌కేపీపీ6: సాయి, శాలినిల పెళ్లి ఫొటో
15ఎంఎల్‌కేపీపీ 2, 3: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాయి, శాలిని
===
కాళ్ల పారాణి ఆరకముందే...
రోడ్డు ప్రమాదంలో నవ దంపతుల మృతి
ఇద్దరూ కాకినాడ జిల్లా వాసులు
మల్కాపురం (విశాఖపట్నం), జూన్ 15 (ఆంధ్రజ్యోతి):
కాళ్ల పారాణి ఆరకముందే.. మామిడి తోరణాలు వాడకముందే.. పెళ్లి నాటి సందడిని మరవకముందే ఆ నవ దంపతులు కానరాని లోకాలకు తరలి‘పోయారు’. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న నెల రోజులకే వారిద్దరూ ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖలోని గాజువాక పోలీస్ స్టేషన్ పరిధి మారుతి జంక్షన్ వద్ద చోటుచేసుకున్న ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతానికి చెందిన జొన్నాడ సాయి (27), విశాఖలోని గంగవరం ప్రాంతానికి చెందిన ఎరిపిల్లి శాలిని (25) గాజువాకలోని బెస్ట్ విజన్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషియన్లుగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ ప్రేమించుకోవడంతో పాటు పెద్దలను ఒప్పించి పిఠాపురంలో గతనెల 9న వివాహం చేసుకున్నారు. అనంతరం బంధువులకు గాజువాక ప్రాంతంలో విందు కూడా ఇచ్చారు. ప్రస్తుతం దంపతులిద్దరూ గాజువాకలోనే నివాసం ఉంటున్నారు. శనివారం సాయి పుట్టినరోజు కావడంతో సెలవు లేని కారణంగా ల్యాబ్‌లోనే ఉండిపోయారు. ఆదివారం నగరంలోని ఆర్కే బీచ్‌కు వెళ్లేందుకు ములగాడ రోడ్డు మీదుగా ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో మారుతి జంక్షన్ వద్ద ఓ ట్రాలర్ వెనుక నుంచి వీరి వాహనాన్ని బలంగా ఢీకొనడంతో వారిద్దరూ రోడ్డుపై తుళ్లిపడ్డారు. దీంతో సాయి అక్కడికక్కడే మృతి చెందగా, శాలిని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రమాదానికి కారణమైన ట్రాలర్ డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు గాజువాక ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.