మాస్టర్‌ప్లాన్‌పై అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంపు
ABN , Publish Date - Jun 29 , 2025 | 12:34 AM
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించిన మాస్టర్ ప్లాన్-2041పై అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంచినట్టు చైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ విశ్వనాథన్‌లు శనివారం తెలిపారు.
వచ్చే నెల 17వ తేదీ వరకూ అవకాశం
జిల్లాల వారీగా సలహాల స్వీకారం
విశాఖ రానవసరం లేకుండా స్థానికంగానే ఏర్పాట్లు
విశాఖపట్నం, జూన్ 28 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) రూపొందించిన మాస్టర్ ప్లాన్-2041పై అభ్యంతరాల స్వీకరణకు గడువు పెంచినట్టు చైర్మన్ ప్రణవ్‌గోపాల్, కమిషనర్ విశ్వనాథన్‌లు శనివారం తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై అనేక ఆరోపణలు, విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత దీనిని సమీక్షించాలని నిర్ణయించింది. ఈ మేరకు నష్టపోయిన వారి నుంచి అభ్యర్థనలు, ఇతరుల నుంచి సలహాలు స్వీకారానికి వీఎంఆర్‌డీఏ పిలుపునిచ్చింది. మే 22వ తేదీ నుంచి జూన్ 21 వరకు గడువు ఇచ్చారు. సుమారు రెండు వేల అభ్యంతరాలు వచ్చాయి. అయితే ఇచ్చిన సమయం సరిపోలేదని, గడువు ఇంకా పెంచాలని పలువురు కోరిన నేపథ్యంలో ప్రభుత్వ అనుమతితో ఈ గడువును జూలై 17వ తేదీ వరకు పొడిగించారు.
జిల్లాల వారీగా స్థానికంగా స్వీకారం
వీఎంఆర్‌డీఏ మాస్టర్ ప్లాన్ పరిధి విశాఖపట్నం జిల్లాతో పాటు అనకాపల్లి, విజయనగరం వరకు ఉండడంతో ఆయా ప్రాంతాల ప్రజలు అభ్యంతరాలు సమర్పించడానికి ఇక్కడవరకూ రానవసరం లేకుండా స్థానికంగానే ఏర్పాట్లు చేశారు. దీనికి ప్రత్యేకంగా కొన్ని తేదీలు కేటాయించారు. ఆ రోజుల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా దగ్గరుండి స్వీకరిస్తారు.
- అనకాపల్లి, పాయకరావుపేట, ఎలమంచిలి నియోజకవర్గాల ప్రజల నుంచి జూన్ 30, జూలై 1 తేదీల్లో అనకాపల్లి ఆర్‌డీఓ కార్యాలయంలో అభ్యంతరాలు తీసుకుంటారు.
- పెందుర్తి, గాజువాక నియోజకవర్గ ప్రజల నుంచి జూలై 3, 4 తేదీల్లో, విశాఖ ఉత్తర, పశ్చిమ, దక్షిణ నియోజకవర్గ ప్రజల నుంచి జూలై 7, 8 తేదీల్లో, విశాఖ తూర్పు, భీమిలి నియోజకవర్గ ప్రజల నుంచి జూలై 10, 11 తేదీల్లో సిరిపురం వీఎంఆర్‌డీఏ భవనంలోని మూడో అంతస్థులో దరఖాస్తులు తీసుకుంటారు.
- ఎస్.కోట, విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల నుంచి జూలై 14, 15 తేదీల్లో విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో అభ్యంతరాలు తీసుకుంటారు.
- జూలై 16, 17 తేదీల్లో చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ విశ్వనాథన్‌లు కలిసి ఏ జిల్లాల వారు వచ్చినా అభ్యంతరాలు స్వీకరిస్తారు.