కునారిల్లుతున్న డీసీఎంఎస్
ABN , Publish Date - Jun 23 , 2025 | 12:47 AM
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఆర్థిక సమస్యలనే కాకుండా వసతి సమస్యను కూడా ఎదుర్కొంటున్నది. ఎప్పుడు ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. గోడలు, శ్లాబు పగుళ్లిచ్చాయి. శ్లాబ్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపడుతుండడంతో ఉద్యోగులు భయంభయంగా విధులు నిర్వహిస్తున్నారు. వర్షం కురిస్తే శ్లాబ్ కారిపోతుండడంతో రికార్డులు పాడైపోతున్నాయి. డీసీఎంఎస్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో వుండడంతో కొత్త భవనం నిర్మించలేని పరిస్థితి ఏర్పడింది.
వెన్నాడుతున్న ఆర్థిక ఇక్కట్లు
శిథిలావస్థకు చేరిన భవనం
వర్షం కురిస్తే.. కారిపోతున్న శ్లాబ్
భయంభయంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు
దీపావళి సామగ్రికే పరిమితమైన వ్యాపారం
అర్ధంతరంగా ఆగిన పెట్రోల్ బంకు నిర్మాణం
చైర్మన్‌పైనే పూర్వ వైభవం బాధ్యత
అనకాపల్లి టౌన్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఆర్థిక సమస్యలనే కాకుండా వసతి సమస్యను కూడా ఎదుర్కొంటున్నది. ఎప్పుడు ఆరు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. గోడలు, శ్లాబు పగుళ్లిచ్చాయి. శ్లాబ్ నుంచి సిమెంట్ పెచ్చులు ఊడిపడుతుండడంతో ఉద్యోగులు భయంభయంగా విధులు నిర్వహిస్తున్నారు. వర్షం కురిస్తే శ్లాబ్ కారిపోతుండడంతో రికార్డులు పాడైపోతున్నాయి. డీసీఎంఎస్ పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో వుండడంతో కొత్త భవనం నిర్మించలేని పరిస్థితి ఏర్పడింది.
అనకాపల్లి కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీని 1962-63లో బొడ్డేడ అచ్చింనాయుడు అనే వ్యక్తి స్థాపించారు. ఆయన హయాంలో సొంతభవనం నిర్మించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్‌టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్)లను ఏర్పాటు చేశారు. అప్పటి వరకు అనకాపల్లి కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీగా వున్న దీనిని డీసీఎంఎస్‌గా మార్చారు. సుమారు ఎకరా 64 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న ఈ కార్యాలయం ద్వారా గతంలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, దీపావళి సమయంలో మందుగుండు సామగ్రి అమ్మకాలు జరిగేవి. అయితే సంస్థకు వచ్చే ఆదాయంకన్నా వ్యయం అధికంగా వుండడంతో కాలక్రమేణా నష్టాలబాట పట్టింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, నోట్ పుస్తకాలు కొనుగోలు చేయడానికి నిధులు లేకపోవడంతో ఏటా దీపావళి పండగకు మందుగుండు సామగ్రి అమ్మకాలు మాత్రమే చేస్తున్నారు. డీసీఎంఎస్‌లో ప్రస్తుతం బీఎంతో సహా ఐదుగురు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. భవనమంతా శిథిలావస్థకు చేరుకోవడంతో విధులు నిర్వహించడానికి భయపడుతున్నారు. నిర్వహిస్తున్నారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం లేదు. ఉద్యోగులతోపాటు వివిధ పనుల నిమిత్తం వచ్చే రైతులు ఇబ్బంది పడుతున్నారు. సంస్థకు పూర్వ వైభవం తీసుకురావాలన్న ఉద్దేశంతో పెట్రోల్ బంకు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. కానీ బంకు నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఇటీవల కోట్ని బాలాజీని చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. డీసీఎంఎస్ ద్వారా గతంలో మాదిరిగా ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల వ్యాపారం చేయడానికి ప్రభుత్వ సహకారంతో ఆయన ప్రయత్నిస్తున్నారు. ఎంత వరకు సాకారం అవుతాయో వేచి చూడాలి.
ఎంపీ రమేశ్ దృష్టికి సొసైటీ సమస్యలు
కోట్ని బాలాజీ, చైర్మన్, డీసీఎంఎస్ (19ఎకెపిటౌన్-6)
డీసీఎంఎస్ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను ఎంపీ సీఎం రమేశ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నాం. నూతన భవన నిర్మాణానికి గ్రాంటు రూపంలో నిధులు మంజూరు చేయాలని డీసీసీబీని కోరాం. కంపెనీలు లేదా పరిశ్రమల నుంచి సీఎస్‌ఆర్ నిధులు మంజూరు చేయించి భవన నిర్మాణానికి సహకరించాలని ఎంపీని కోరుతున్నాం.
నూతన భవన నిర్మాణానికి ప్రతిపాదనలు
సత్యకుమార్, బీఎం, డీసీఎంఎస్ (19ఎకెపిటౌన్-7)
డీసీఎంఎస్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. మరమ్మతులు చేసినా ఫలితం ఉండదు. ప్రస్తుత భవనాన్ని పూర్తిగా తొలగించి, కొత్త భవనం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. కార్యాలయంతోపాటు ఆదాయం వచ్చేలా వాణిజ్య సముదాయం, కల్యాణ మండలం నిర్మిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. అంచనాలు తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం..