స్మార్ట్ బస్టాపుల్లో అంధకారం!
ABN , Publish Date - Sep 04 , 2025 | 01:29 AM
నగరంలో అట్టహాసంగా నిర్మించిన స్మార్ట్ బస్టాప్‌లు నిర్వహణాలోపంతో సతమతమవుతున్నాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన బస్టాప్‌లు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులకు సరైన సేవలు అందించలేకపోతున్నాయి. ఇప్పటికే కొన్ని బస్టాపుల నేమ్‌బోర్డులు మాయమైపోగా, ఇప్పుడు రాత్రివేళ బస్టాపుల్లో లైట్లు వెలగకపోవడంతో అంధకారం అలముకుంటోంది. దీంతో ప్రయాణికులు రాత్రి వేళ ఆయా బస్టాప్‌ల్లో వేచి ఉండాలంటే భయపడుతున్నారు.
వెలగని దీపాలు
జాతీయ రహదారి పొడవునా ఇదే పరిస్థితి
ఇబ్బందిపడుతున్న ప్రయాణికులు
చీకట్లో రోడ్డుపైనే నిల్చోవాల్సిన పరిస్థితి
పట్టించుకోని అధికారులు
ఆ బాధ్యత తమది కాదంటున్న జీవీఎంసీ ఎలక్ర్టికల్ విభాగం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో అట్టహాసంగా నిర్మించిన స్మార్ట్ బస్టాప్‌లు నిర్వహణాలోపంతో సతమతమవుతున్నాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన బస్టాప్‌లు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులకు సరైన సేవలు అందించలేకపోతున్నాయి. ఇప్పటికే కొన్ని బస్టాపుల నేమ్‌బోర్డులు మాయమైపోగా, ఇప్పుడు రాత్రివేళ బస్టాపుల్లో లైట్లు వెలగకపోవడంతో అంధకారం అలముకుంటోంది. దీంతో ప్రయాణికులు రాత్రి వేళ ఆయా బస్టాప్‌ల్లో వేచి ఉండాలంటే భయపడుతున్నారు.
జీ-20 సదస్సు సందర్భంగా 2023లో స్మార్ట్ బస్టాప్‌లకు జీవీఎంసీ శ్రీకారం చుట్టింది. మొట్టమొదట ఏయూ అవుట్‌గేట్ వద్ద రూ.25 లక్షల వ్యయంతో నిర్మించిన స్మార్ట్ బస్టాపునకు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో నగర పరిధిలో 20 చోట్ల అదేతరహాలో స్మార్ట్ బస్టాపులను ఏర్పాటుచేసింది. ఇందుకోసం ఒక్కోదానికి రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు జీవీఎంసీ వెచ్చించింది. బస్టాపుల్లో అత్యాధునికమైన ఎల్‌ఈడీ లైట్లు, రాత్రివేళ ఆకర్షనీయంగా కనిపించేలా నేమ్ బోర్డులు, బస్టాప్‌లో కూర్చునేందుకు గ్రానైట్ పలకలతో కూడిన అరుగు, స్టెయిన్‌లెస్ స్టీల్ పోల్స్, పైకప్పునకు సీలింగ్ వంటి హంగులు అద్దారు. రెండేళ్ల కిందట ఆయా బస్టాపులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే ఆ తరువాత బస్టాపుల నిర్వహణపై అధికారులు దృష్టిసారించలేదు. దీంతో బస్టాపుల ముందు ఏర్పాటుచేసిన నేమ్‌బోర్డులు, సీలింగ్‌లు ఊడిపోయాయి. ప్రస్తుతం మద్దిలపాలెం జంక్షన్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా నిర్మించిన స్మార్ట్ బస్టాపుల్లో లైట్లు వెలగడం లేదు. దీనివల్ల రాత్రివేళ బస్టాపుల వద్ద అంధకారం రాజ్యమేలుతోంది. షెల్టర్‌లలో చీకటిగా ఉండడంతో ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డుపైనే వేచి ఉంటున్నారు. అదేసమయంలో ఖాళీగా ఉంటున్న బస్టాపులను ఆకతాయిలు, భిక్షాటన చేసుకునేవారు ఆవాసాలుగా మార్చుకుంటున్నారు. బస్టాపుల వద్ద లైట్లను మరమ్మతు చేసి లైటింగ్‌ను పునరుద్ధరించాల్సిన జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఆపని తమది కాదన్నట్టు చోద్యం చూస్తున్నారు. ఈ విషయం జీవీఎంసీ ఎలక్ర్టికల్ విభాగం ఎస్‌ఈ సంపత్‌కుమార్ వద్ద ప్రస్తావించగా, బస్టాప్‌ల లైటింగ్‌కు, తమకు సంబంధం లేదన్నారు. మరి బస్టాప్‌లలో లైట్లను వెలిగించే బాధ్యత ఎవరిదో ఉన్నతాధికారులే చెప్పాలి.