అధ్వానంగా డముకు-నిమ్మలపాడు రోడ్డు
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:36 PM
మండలంలోని హుకుంపేట, పాడేరు రోడ్లకు అనుసంధానంగా ఉన్న డముకు-నిమ్మలపాడు రోడ్డు అధ్వానంగా తయారైంది. అడుగుకో గుంత ఏర్పడింది. దీంతో గిరిజనుల ప్రయాణానికి చింతగా మారింది. అయినా ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదు.

18 కిలోమీటర్లలో అడుగడుగునా గుంతలే
ప్రయాణానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్న గిరిజనులు
పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు
అనంతగిరి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని డముకు నుంచి నిమ్మలపాడు రోడ్డు గోతులమయమైంది. సుమారు 18 కిలోమీటర్ల రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ గోతుల్లోనే గిరిజనులు రాకపోకలు సాగించాల్సి వస్తోంది. దీంతో పెదబిడ్డ, లంగుపర్తి, వాలసీ, గుమ్మ పంచాయతీల గిరిజనులు ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు నరకం చూస్తున్నారు. డముకు గ్రామానికి కూత వేటు దూరం నుంచి గుంతల ప్రయాణం ప్రారంభమవుతోంది. అక్కడ నుంచి చెరుకుమడత జంక్షన్ వద్ద అర కిలోమీటరు రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. మేడపర్తి-పులుసుమామిడికి మధ్యలోని మలుపు వద్ద రోడ్డు కోతకు గురికావడంతోపాటుగా మేడపర్తి వంతెన వద్ద ఇసుకమేటలు కుప్పలుగా ఉండిపోయి, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అదేవిధంగా లంగుపర్తి-బొడ్డపాడు మీదుగా వాలసీ నిమ్మలపాడు రోడ్డు వర్షాల కారణంగా అస్తవ్యస్తంగా మారింది. కనీసం రోడ్డు మరమ్శతులపై ఆర్‌అండ్‌బీ శాఖ దృష్టి సారించలేదు. దీంతో గిరిజనులు ప్రమాదాలకు గురవుతున్నారు.
ఓ ప్రమాదంలోని ముగ్గురు యువకులు మృత్యువాత
డముకు-నిమ్మలపాడు రోడ్డు రాయిపాడు సమీపంలో 2023లో రక్షణ గోడను ద్విచక్రవాహనం ఢీకొట్టి లోయలో పడిన ఘటనలో బూర్జ పంచాయతీ దిగసల్తాంగి గ్రామానికి చెందిన రాపా బుట్టన్న, సీదరి రాంబాబు, బొండం గణేశ్ ముగ్గురు యువకులు మృతిచెందాడు. మహాశివరాత్రి సందర్భంగా బొర్రా వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అలాగే పలు ప్రమాదాలు గిరిజనులు తీవ్రంగా గాయపడ్డారు.
పాడేరు, హుకుంపేట, అరకులోయలకు అనుసంధానం
పాడేరు, హుకుంపేట, అరకులోయ మండలాలకు వెళ్లేందుకు డముకు-నిమ్మలపాడు రోడ్డు అనుసంధానంగా ఉంటుంది. నిమ్మలపాడు నుంచి వేంగడ మీదుగా కించుమండ చేరుకుంటే.. అక్కడ నుంచి ఎన్‌హెచ్ 516 రోడ్డుకు చేరుకుని హుకుంపేట వెళ్లవచ్చు. లేదా బాకూరు మీదుగా హుకుంపేట, పాడేరు కూడా వెళ్లవచ్చు. నిమ్మలపాడు నుంచి పైనంపాడు మీదుగా బస్కీ చేరుకుని, అక్కడ నుంచి అరకులోయకు చేరుకోవచ్చు.
రోడ్డు మరమ్శతులు వెంటనే చేయించాలి
దామోదర్, గ్రామస్థుడు, పులుసుమామిడి
అధ్వాన రోడ్డు కారణంగా ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. చెరుకుమడత జంక్షన్ వద్ద రోడ్డంతా కొట్టుకుపోయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో అత్యవసర సమయాల్లో గుంతలపై ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి, మరమ్శలు చేయించాలి.