డిప్యూటీ మేయర్‌గా దల్లి గోవిందరాజు ఏకగ్రీవంగా ఎన్నిక
ABN , Publish Date - May 21 , 2025 | 12:46 AM
జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేనకు చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు ఎన్నికయ్యారు.
విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేనకు చెందిన 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరాజు ఎన్నికయ్యారు. కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జియ్యాని శ్రీధర్ డిప్యూటీ మేయర్ పదవిని కోల్పోయారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కొత్త డిప్యూటీ మేయర్ ఎన్నిక నిమిత్తం జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ సోమవారం కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేయగా, కోరం లేక మంగళవారానికి వాయిదాపడిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి హోదాలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ కౌన్సిల్ హాల్‌కు చేరుకున్నారు. ఎన్నిక నిర్వహించడానికి 56 మంది సభ్యులు అవసరమని, హాజరైనవారి సంఖ్యను లెక్కించాలని రో అధికారులను ఆదే శించారు. ఏడుగురు ఎమ్మెల్యేలు, 52 మంది కార్పొరేటర్లు అప్పటికి హాజరైనట్టు అధికారులు నివేదించడంతో సమావేశాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేయాలనుకునే అభ్యర్థిని ఒకరు ప్రతిపాదిస్తే, మరొకరు బలపరచాల్సి ఉంటుందని, ఇద్దరు కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే ఎన్నిక జరుపుతామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. డిప్యూటీ మేయర్‌గా దల్లి గోవిందరాజు పేరును పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు గణబాబు ప్రతిపాదించగా, ఉత్తరం నియోజకవర్గ శాసనసభ్యుడు పి.విష్ణుకుమార్‌రాజు బలపరిచారు. ఇంకెవరైనా పోటీలో ఉన్నారా? అని జాయింట్ కలెక్టర్ అడగ్గా...సభ్యుల నుంచి సమాధానం లేకపోవడంతో గోవిందరాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. అనంతరం డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్టు ధ్రువీకరణ పత్రాన్ని దల్లిదోవిందరాజుకు అందజేశారు. ఆ సమయంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతోపాటు మరికొందరు కార్పొరేటర్లు సమావేశానికి హాజరైనప్పటికీ వారి సంఖ్యను పరిగణనలోకి తీసుకోబోమని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. వెంటనే దల్లి గోవిందరాజుతో ప్రమాణ స్వీకారం చేయించారు.
పలువురి అభినందన
డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన దల్లి గోవిందరాజును ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, కొణతాల రామకృష్ణ, వెలగపూడి రామకృష్ణబాబు, గంటా శ్రీనివాసరావు, విష్ణుకుమార్‌రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు అభినందించారు. దల్లి గోవిందరాజుకు భార్య, కుటుంబ సభ్యులు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నాటి సమావేశానికి గైర్హాజరైన అసంతృప్త కార్పొరేటర్లు మంగళవారం జరిగిన సమావేశానికి హాజరుకావడంతోపాటు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన దల్లి గోవిందరాజును అభినందించి శుభాంకాంక్షలు తెలిపారు.
ఇది కూటమి విజయం
జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్
జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా దల్లి గోవిందరాజు ఎన్నికకావడం కూటమి విజయమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్ అన్నారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం ఆయన జీవీఎంసీ కార్యాలయం బయట విలేకరులతో మాట్లాడారు. వైసీపీ హయాంలో జీవీఎంసీని దోచుకుతిన్నారని ఆరోపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీ అరాచక పాలన నుంచి నగరవాసులను బయటపడేసేందుకు మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టి సమష్టిగా విజయం సాధించామన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలల్లో నగర అభివృద్ధి వేగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.