పాడి రైతుల నెత్తిన పాలు
ABN , Publish Date - May 09 , 2025 | 01:26 AM
పాల సరఫరాలో రైతులకు స్వేచ్ఛ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
సరఫరాలో స్వేచ్ఛ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం
ఏ డెయిరీ ఎక్కువ రేటు ఇస్తే ఆ డెయిరీకి ఇచ్చుకోవచ్చు
అమూల్‌కు మాత్రమే పాలు పోయాలన్న నిబంధన తొలగింపు
కొత్తగా మహిళా డెయిరీ సహకార సంఘాల ఏర్పాటు
తొలిదశలో జిల్లాకు 15 సంఘాలు
రూ.1.5 లక్షల విలువైన కిట్లు సరఫరా
డీసీసీబీ ద్వారా పాడి రైతులకు రుణాలు
విశాఖపట్నం, మే 8 (ఆంధ్రజ్యోతి):
పాల సరఫరాలో రైతులకు స్వేచ్ఛ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏర్పాటైన ‘అమూల్’కు మాత్రమే పాలు పోయాలన్న నిబంధనను తొలగించింది. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి సరఫరా చేసుకునేలా ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలో తొలివిడత కొత్తగా 15 మహిళా డెయిరీ సహకార సంఘాల ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ సంఘాల ఏర్పాటు నుంచి నిర్వహణ, పాల సేకరణ, రైతులకు శిక్షణ, రుణాల మంజూరు తదితర అంశాలను ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య (ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్) పర్యవేక్షించనున్నది.
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న డెయిరీలను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీని తీసుకువచ్చింది. అమూల్ డెయిరీ ప్రైవేటు సంస్థ అయినప్పటికీ ప్రతి జిల్లాలో ఉపాధి హామీ నిధులతో పాల సేకరణ కేంద్రాలు, ప్రధానమైనచోట్ల పాల శీతలీకరణ సెంటర్లు ఏర్పాటుచేసింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులు అమూల్ కోసం పనిచేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి అమూల్‌కు పాలు పోసే రైతులకు రుణాలు మంజూరుచేశారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అధికారులు నానా ఇబ్బందులు పడ్డారు. స్థానికంగా ఉండే డెయిరీల కంటే అమూల్ ప్రయోజనాలకు పెద్దపీట వేయడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత అమూల్ డెయిరీ విషయంలో అధికారులపై ఒత్తిడి తగ్గింది.
గ్రామీణ మహిళలకు సాధికారిత కల్పించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కొత్తగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రతి జిల్లాలో మహిళా డెయిరీ సహకార సంఘాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా విశాఖ జిల్లాలో తొలివిడతలో 15 సంఘాలు ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటివరకూ జెర్రిపోతులపాలెం, మజ్జిపేట, దాకమర్రిలో మహిళా డెయిరీ సహకార సంఘాల ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. మిగిలిన 12 సంఘాలు నెలాఖరు నాటికి స్థాపించనున్నారు. ప్రతి సంఘానికి కార్యదర్శి, ప్రమోటర్, కో-ప్రమోటర్‌తోపాటు మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. అంతకంటే ఎక్కువ సభ్యులను చేర్చుకునే అవకాశం ఇచ్చారు. సభ్యులంతా పాడి పశువులు ఉన్నవారు వారై ఉండాలి. పాలు ఫలానా డెయిరీకి సరఫరా చేయాలన్న నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఎక్కువ రేటు ఇచ్చే డెయిరీకి పాలు సరఫరా చేసుకునే స్వేచ్ఛ సంఘానికి ఉంటుంది. సంఘం నిర్వహణ, పాల సేకరణ, పాల నాణ్యత, ఇత్యాది అంశాల కోసం ప్రతి సంఘానికి ప్రభుత్వం రూ.1.5 లక్షల విలువైన కంప్యూటర్, ప్రింటర్, యూపీఎస్, ఎనలైజర్, వెన్న శాతం కొలిచే పరికరం, తూకపు యంత్రం, డిస్‌ప్లే బోర్డు తదితర పరికరాలు సరఫరా చేస్తుంది. సంఘం నిర్వహణకు ప్రతి లీటరుకు కొద్దిమొత్తం సంబంధిత డెయిరీ చెల్లించాలని నిబంధన పెట్టారు. పాలుపోసే రైతులకు డీసీసీబీ బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేస్తారు. డెయిరీ నుంచి పాల సొమ్ము బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. పాల సేకరణ ప్రారంభం తరువాత పశువులకు దాణా కోసం ప్రతి రైతుకు రూ.50 వేల వరకు రుణాలు ఇవ్వనున్నారు. కాగా అన్ని జిల్లాల్లో 1964 సహకార సంఘాల చట్టం నిబంధనల మేరకు మహిళా డెయిరీ సహకార సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ పాడిపరిశ్రామిభివృద్ధి సహకార సమాఖ్య ప్రతినిధి రాకేష్ తెలిపారు. సంఘాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతుందని, త్వరలో పాల సేకరణ ప్రారంభిస్తామన్నారు. ఆయా గ్రామాలకు అందుబాటులో ఉండే డెయిరీలకు రైతులు పాలు విక్రయించవచ్చునని, ఈ విషయంలో ఎటువంటి ఒత్తిడి, షరతులు లేవన్నారు.