Share News

మహిళల ఆర్థిక ప్రగతికి డెయిరీలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 11:20 PM

మహిళల ఆర్థిక ప్రగతికి డెయిరీలు ఏర్పాటు చేస్తున్నట్టు పశుసంవర్థకశాఖ జిల్లా మహిళా డెయిరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ తెలిపారు.

మహిళల ఆర్థిక ప్రగతికి డెయిరీలు
మాట్లాడుతున్న డాక్టర్‌ చంద్రశేఖర్‌

జిల్లాకు 15 మంజూరు

15 మెగా గోకులాల నిర్మాణం

పశుసంవర్థక శాఖ జిల్లా మహిళా డెయిరీ ఏడీ డాక్టర్‌ చంద్రశేఖర్‌

చింతపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి):

మహిళల ఆర్థిక ప్రగతికి డెయిరీలు ఏర్పాటు చేస్తున్నట్టు పశుసంవర్థకశాఖ జిల్లా మహిళా డెయిరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో పశుసంవర్థకశాఖ ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 15 మహిళా డెయిరీలను మంజూరు చేసిందన్నారు. దేవిపట్నంలో రెండు, రాజవోమ్మంగిలో ఆరు, అడ్డతీగలలో మూడు, కొయ్యూరు మండలంలో నాలుగు కేటాయించిందని చెప్పారు. తొలి విడతగా 11 గ్రామాల్లో మహిళా డెయిరీలను ఏర్పాటు చేశామన్నారు. మహిళలు సేకరించిన పాలను సంగం, విశాఖ, దొడ్ల, శ్రీచక్ర, అమూల్‌ డెయిరీలకు అందజేస్తున్నామన్నారు. డెయిలు నిర్వహిస్తున్న మహిళలకు బ్యాంక్‌ ఖాతాలు తెరవడంతో పాటు రుణాలు అందజేస్తున్నామన్నారు. పాడేరు, కొయ్యూరు మండలాల్లో 15 మెగా గోకులాలు నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో 20 సెంట్ల విస్తీర్ణంలో షెడ్లు నిర్మించామని చెప్పారు. గోకులం పరిధి మహిళా రైతుకి రెండు ఆవులుగాని, రెండు గేదెలుగాని అందజేస్తామన్నారు. గత నెలలో పూర్తిచేసిన పశుగణన ఆధారంగా బ్లాంకెట్‌ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన, ముంపునకు గురై మరణించిన పశువులకు పరిహారం చెల్లిస్తామన్నారు. గత ఏడాది ప్రమాదంలో మరణించిన పశువులకు రూ.15 వేలు, మేకలు, గొర్రెలకు రూ. నాలుగువేలు చొప్పున రైతులకు అందజేశామన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గోకులాలు నిర్మిస్తున్నామని, కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాలకు 120 మంజూరయ్యాయని తెలిపారు. ఈ సమావేశంలో లంబసింగి, లోతుగెడ్డ పశువైద్యాధికారులు డాక్టర్‌ చల్లంగి చాలిని, డాక్టర్‌ మత్స్యరాస సౌజన్యదేవి పాల్గొన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 11:20 PM