Share News

సైక్లింగ్‌ ట్రాక్‌లు

ABN , Publish Date - Dec 09 , 2025 | 01:50 AM

విశాఖపట్నంలో సైక్లింగ్‌ ట్రాక్‌లు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

సైక్లింగ్‌ ట్రాక్‌లు

  • మరోమారు కొత్తగా ప్రతిపాదనలు

  • ఏడేళ్ల క్రితం బీచ్‌ రోడ్డు సహా నగరంలో ట్రాక్‌ ఏర్పాటుకు జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏల యత్నం

  • పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చని వైనం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో సైక్లింగ్‌ ట్రాక్‌లు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పచ్చదనంతో కళకళలాడే విశాఖలో పర్యావరణం కోసం సైకిళ్లను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. అయితే ఈ ప్రయోగం ఇక్కడ ఏడేళ్ల క్రితమే చేసి అధికారులు వైఫల్యం చెందారు. ఇటు వీఎంఆర్‌డీఏ, అటు జీవీఎంసీ చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కాలేదు. అదొక్కటే కాకుండా బీచ్‌రోడ్డులో వీఎంఆర్‌డీఏ పార్కు నుంచి భీమిలి వరకూ బీచ్‌ కారిడార్‌లో సైక్లింగ్‌ ట్రాక్‌ను 27 కి.మీ. పొడవున ఏర్పాటుచేయాలని ఈ రెండు సంస్థలు ప్రతిపాదించాయి. అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం బీచ్‌ కారిడార్‌ను వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం విస్తరిస్తే తప్ప ఈ మార్గంలో సైక్లింగ్‌ కోసం ఇరువైపులా ప్రత్యేక ట్రాక్‌ ఏర్పాటుచేసే అవకాశం లేదు. ఉన్న మార్గం మధ్యలోనే డివైడర్‌ పెట్టి, అందులో మొక్కలు వేసి, గ్రిల్స్‌ ఏర్పాటుచేశారు. రోడ్డుకు మూడు నుంచి నాలుగు అడుగుల విశాలమైన ఫుట్‌పాత్‌లు వేశారు. ఇప్పుడు ఆ మార్గాన్ని విస్తరించకుండా సైకిళ్ల కోసం మార్గం ఏర్పాటుచేస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు, ప్రమాదాలు తప్పవు.

సిరిపురంలో కనిపించని సైకిల్‌ ట్రాక్‌

విశాఖపట్నం స్మార్ట్‌ సిటీలో భాగంగా వీఎంఆర్‌డీఏ సిరిపురంలో తన కార్యాలయం సమీపాన ఫ్యూజన్‌ ఫుడ్స్‌ హోటల్‌ పక్క నుంచి ఆకాశవాణి కేంద్రం వరకు ఎడమ వైపున సైకిల్‌ ట్రాక్‌ను 2018లో ఏర్పాటు చేసింది. 300 మీటర్ల పొడవు, ఏడు అడుగుల వెడల్పున ఆకుపచ్చ రంగు రోడ్డుపై పూసి, దానిపై సైకిల్‌ బొమ్మలను వేసింది. దానినే ‘సైకిల్‌ ట్రాక్‌’గా ప్రచారం చేశారు. ఆ తరువాత జీవీఎంసీ కమిషనర్‌గా పనిచేసిన హరినారాయణ బీచ్‌ రోడ్డులో సైకిళ్లు తొక్కడం అలవాటు చేయాలని 100 కొత్త సైకిళ్లను కొని నాలుగు ప్రాంతాల్లో పెట్టి ఆసక్తి కలిగిన వారికి ఉచితంగా వాటిని ఇవ్వడం ప్రారంభించారు. కాళీమాత ఆలయం, పాండురంగాపురం, వైఎంసీఏ ప్రాంతాల్లో ఒక్కోచోట 25 సైకిళ్లకు అందుబాటులో ఉంచారు. పేర్లు నమోదు చేసుకుంటే సైకిళ్లను తొక్కడానికి ఇచ్చేవారు. ఆ ముచ్చట కూడా మూన్నాళ్లగానే మారింది. ఆ 100 సైకిళ్లు ఏమయ్యాయో కూడా తెలియదు. సైకిళ్లను ప్రోత్సహిస్తున్నామని చెప్పడానికి జీవీఎంసీ కమిషనర్లు ఆశీల్‌మెట్టలో సంపత్‌ వినాయకుడి ఆలయం సమీపానున్న బంగ్లా నుంచి జీవీఎంసీ కార్యాలయానికి ప్రతి సోమవారం సైకిల్‌పై వచ్చేవారు. ఈ ముచ్చట్లన్నీ తీరిపోయాయి. ఇప్పుడు మళ్లీ కొత్త సైకిళ్లను కొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Dec 09 , 2025 | 01:50 AM