Share News

ముందస్తు రబీ పంటగా వలిసెల సాగు

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:39 AM

గిరిజన ప్రాంతంలో ముందస్తు రబీ పంటగా వలిసెల సాగుకు రైతులు సన్నద్ధం కావాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచించారు. నాట్లుకు ఇదే అదునని, రైతులు పంట పొలాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నూనె గింజల పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని, రైతులు వలిసెల సాగు చేపడితే అధిక ఆదాయం పొందవచ్చునన్నారు.

ముందస్తు రబీ పంటగా వలిసెల సాగు
వలిసెల పంట (ఫైల్‌)

- నాట్లుకు ఇదే అదును

- నూనె గింజలకు మార్కెట్‌లో ప్రత్యేక డిమాండ్‌

- గిరిజన రైతులకు ఉత్కల్‌ నైజర్‌ 150 వంగడాలు పంపిణీ

చింతపల్లి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో ముందస్తు రబీ పంటగా వలిసెల సాగుకు రైతులు సన్నద్ధం కావాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచించారు. నాట్లుకు ఇదే అదునని, రైతులు పంట పొలాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నూనె గింజల పంటకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉందని, రైతులు వలిసెల సాగు చేపడితే అధిక ఆదాయం పొందవచ్చునన్నారు.

పాడేరు రెవెన్యూ డివిజన్‌లో ఆదివాసీ రైతులు గతంలో వలిసెల పంటను 16 వేల హెక్టార్లలో సాగు చేసేవారు. కాలక్రమంగా ఆకాశ పందిరి కలుపు ఉధృతి, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో సాగు విస్తీర్ణం పడిపోయింది. ప్రస్తుతం పాడేరు డివిజన్‌ పరిధిలో ఐదు వేల హెక్టార్లలో మాత్రమే వలిసెల పంటను సాగుచేస్తున్నారు. అధిక నూనెశాతం కలిగిన వలిసెల పంట మన్యం ప్రకృతి అందాలకు మరింత శోభను తీసుకొస్తుంది. వలిసెల నూనెను వంట నూనెగా, రుచికరమైన ఆహార పదార్థాల తయారీ, పరిశ్రమల్లో రంగులు, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. ఈ కారణంగా వలిసెలకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తోంది.

వాతావరణం, విత్తే సమయం

వలిసెల సాగుకు సంవత్సర సరాసరి వర్షపాతం వెయ్యి మిల్లీమీటర్లు అవసరం. సాగు చేసేందుకు 18-23 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత అనుకూలం. గిరిజన ప్రాంత వాతావరణం, నేలలు సాగుకు అత్యంత అనుకూలం. సెప్టెంబరు రెండో పక్షం నుంచి అక్టోబరు మొదటి వారం వరకూ వలిసెల నాట్లు వేసుకోవడానికి అనుకూలం.

అనుకూలమైన రకాలు, దిగుబడి

కేజీఎన్‌-2 రకం వలిసెలు 50 రోజుల్లో పూతకు వస్తాయి. 190 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతుంది. 100-110 రోజులకు పంట కోతకు వస్తుంది. హెక్టారుకు 4-5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఉత్కల్‌ నైజర్‌-150 ఎకరాకు 4-6 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. జేఎన్‌ఎస్‌-28, జేఎన్‌ఎస్‌-30 ఎకరాకు 4-5 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. ఎకరాకు 4 కిలోలు విత్తనాలు అవసరం.

అంతర కృషి

వలిసెల సాగులో అంతరకృషి అత్యంత కీలకం. వలిసెలు విత్తనం 15 రోజుల తరువాత 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు కలుపు తీసుకోవాలి. ఈ పంటలో ప్రధానంగా ఆకాశ పందిరి(బంగారుతీగ) అనే సంపూర్ణ కాండ పరాన్నజీవి నాటిన నెల రోజుల్లో ఈ పంటను ఆశించి అధిక నష్టం కలిగిస్తుంది. ఇది నేలలో పడిన విత్తనం ద్వారా(వలిసెల విత్తనాల్లో ఆకాశపందిరి విత్తనాలు కలిసి వుండడం) మాత్రమే వ్యాప్తి చెందుతుంది. అకాశ పందిరి కలుపు మొక్క కాండ పరాన్న జీవిగా వలిసెల పంటను ఆశించి నష్టపరుస్తుంది. వలిసెల మొక్కపై హస్టోరియా అనే భాగాలతో అతుక్కొని అతిథి మొక్క(వలిసెలు) నుంచి కార్బోహైడ్రేట్స్‌ను గ్రహిస్తుంది. దీని వలను వలిసెల దిగుబడి, నాణ్యత, మొక్కల సాంద్రత తగ్గిపోతుంది. అకాశపందిరి కలుపు మొక్క సాధారణంగా విత్తనం ద్వారానే వ్యాప్తిచెందుతుంది. విత్తనాలు నేలలో వుంటూ 20 సంవత్సరాలు మొలకెత్తే సామర్థ్యం కలిగివుంటాయి.

బంగారుతీగ నివారణ

బంగారు తీగ కలుపు నివారణకు వలిసెల విత్తనాలను జల్లెడతో(0.85-1.00ఎంఎం) జల్లించి ఆకాశపందిరి విత్తనాలను వేరు చేసుకోవాలి. లేకుంటే ఎకరాకు అవసరమైన 4 కిలోల విత్తనం 20 లీటర్ల నీటిలో 3కిలోల ఉప్పు కలిపి ఆ ద్రావణంలో వేసి బాగా కలియబెట్టాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆకాశ పందిరి విత్తనాలు అడుగుకు, వలిసెల విత్తనాలు నీటి పైభాగానికి వస్తాయి. ఈ విధంగా ఆకాశ పందిరి కలుపు విత్తనాలను తొలగించుకోవాలి.

పోషక యాజమాన్యం:

వలిసెలు విత్తనం విత్తేసమయంలో ఎకరానికి 4 టన్నుల చొప్పున పశువుల ఎరువుగాని, కంపోస్టు ఎరువుగాని వేసుకోవాలి. దీని వల్ల పంట ఎదుగుదలకు పోషకాలు, నీరు భూమిలో నిలుపుదల చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వలిసెల పంట ఎకరాకు 8 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 4 కిలోల పొటాష్‌, 4-6 కిలోల గంధకాన్ని వచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజని రెండు దఫాలుగా విత్తేటప్పుడు, మొగ్గదశలో వేసుకోవాలి.

Updated Date - Sep 14 , 2025 | 12:39 AM