Share News

రైతుల పొలంలో నూతన వరి రకాల సాగు

ABN , Publish Date - Jul 16 , 2025 | 01:07 AM

గిరిజన రైతుల పంట పొలాల్లో ప్రయోగాత్మకంగా నూతన వరి రకాలను సాగు చేయిస్తున్నామని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. మంగళవారం మండలంలోని కొమ్మంగి గ్రామంలో అభ్యుదయ రైతు వండలం వెంకట సాయి పంట పొలంలో నూతన వంగడాల వరి నాట్లు వేయించారు.

రైతుల పొలంలో నూతన వరి రకాల సాగు
రైతుతో నూతన వరి వంగడాల నారు నాట్లు వేయిస్తున్న ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి

- ఎన్‌ఎల్‌ఆర్‌ 3648, ఆర్‌జీఎల్‌ 7034 రకాలపై అధ్యయనం

- ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి

చింతపల్లి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): గిరిజన రైతుల పంట పొలాల్లో ప్రయోగాత్మకంగా నూతన వరి రకాలను సాగు చేయిస్తున్నామని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. మంగళవారం మండలంలోని కొమ్మంగి గ్రామంలో అభ్యుదయ రైతు వండలం వెంకట సాయి పంట పొలంలో నూతన వంగడాల వరి నాట్లు వేయించారు. ఈ సందర్భంగా ఏడీఆర్‌ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన గ్రామాలు వ్యవసాయానికి అత్యంత అనుకూలమన్నారు. గిరిజన రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేస్తున్నారన్నారు. జిల్లాలో 54 వేల హెక్టార్లలో వరి సాగు ఉందన్నారు. గిరిజన రైతులకు మేలిరకం వంగడాలు అందించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం రైతుల పంట పొలాల్లో పరీక్షించేందుకు నూతన వరి వంగడాలు ఎన్‌ఎల్‌ఆర్‌ 3648, ఆర్‌జీఎల్‌ 7034 మినీ కిట్లు పంపించిందన్నారు. ఈ నూతన వంగడాలు క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు గిరిజన రైతులతో నాట్లు వేయిస్తున్నామన్నారు. నాట్లు వేసిన నాటి నుంచి పంట కోసే వరకు శాస్త్రవేత్తల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. నూతన వరి వంగడాల ఎదుగుదల, నాణ్యత, దిగుబడులను క్షుణ్ణంగా పరిశీలించి విశ్వవిద్యాలయానికి నివేదిక పంపిస్తామన్నారు. ఈ ఫలితాల ఆధారంగా నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశ్వవిద్యాలయం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ బాల హుస్సేన్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 16 , 2025 | 01:07 AM