గోవాడ షుగర్స్‌లో ముగిసిన క్రషింగ్
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:39 AM
గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్ గురువారం రాత్రితో ముగిసింది. ముందుగా ప్రకటించినట్టు గురువారం మధ్యాహ్నంతో ముగించాల్సి వుండగా, కొద్దిసేపటి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో క్రషింగ్ ఆగిపోయింది. అవాంతరాలను సరిదిద్ది ఫ్యాక్టరీని రన్నింగ్‌లో పెట్టి మిగిలిన చెరకును క్రషింగ్ చేసి సీజన్ ముగిసిందని ప్రకటించారు.

పలుమార్లు అవాంతరాలతో 80 రోజులపాటు నడిచిన ఫ్యాక్టరీ
1.09 లక్షల టన్నుల చెరకు గానుగ
53 వేల క్వింటాళ్ల వరకు పంచదార ఉత్పత్తి
రికవరీ ఐదారు శాతానికే పరిమితం?
చోడవరం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): గోవాడ షుగర్ ఫ్యాక్టరీలో చెరకు క్రషింగ్ గురువారం రాత్రితో ముగిసింది. ముందుగా ప్రకటించినట్టు గురువారం మధ్యాహ్నంతో ముగించాల్సి వుండగా, కొద్దిసేపటి ముందు సాంకేతిక సమస్య తలెత్తడంతో క్రషింగ్ ఆగిపోయింది. అవాంతరాలను సరిదిద్ది ఫ్యాక్టరీని రన్నింగ్‌లో పెట్టి మిగిలిన చెరకును క్రషింగ్ చేసి సీజన్ ముగిసిందని ప్రకటించారు. ఈ ఏడాది జనవరి 21వ తేదీన క్రషింగ్ ప్రారంభించి, ఏప్రిల్ పదో తేదీతో ముగించారు. మొత్తం మీద 81 రోజులపాటు క్రషింగ్ జరిగింది. కానీ క్రషింగ్ ప్రారంభించిన నాటి నుంచి, క్రషింగ్ ముగిసే వరకు పలుమార్లు సాంకేతిక సమస్యలు, బగాస్ కొరత వంటి కారణాలతో క్రషింగ్ ఆగిపోయింది. ఈ సమయాన్ని మినహాయిస్తే క్రషింగ్ సుమారు 60 రోజులపాటు జరిగి వుంటుందని అంచనా. ప్రస్తుత సీజన్‌లో కనీసం లక్షన్నర టన్నుల చెరకు క్రషింగ్ చేయాలని ఫ్యాక్టరీ అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా, చివరకు లక్షా తొమ్మిది వేల టన్నులతో ముగించాల్సి వచ్చింది. వాస్తవానికి పొలాల్లో ఇంకా చెరకు వుంది. కానీ ఫాక్టరీలో క్రషింగ్ అస్తవ్యస్తంగా తయారవడం, ఫ్యాక్టరీ యార్డులో, కాటాల వద్ద చెరకు బండ్లతో రైతులు రోజుల తరబడి వేచివుండాల్సి రావడంతో చాలామంది రైతులు చెరకును బెల్లం తయారీ క్రషర్ల నిర్వాహకులకు అయినకాడికి అమ్ముకున్నారు. గురువారం రాత్రి క్రషింగ్ ముగించే సమయానికి లక్షా 8 వేల 758 టన్నుల చెరకు క్రషింగ్ జరగ్గా, 52 వేల క్వింటాళ్ల పంచదార ఉత్పత్తి అయింది. మిగిలిన చెరకు రసం ద్వారా మరో వెయ్యి క్వింటాళ్ల పంచదార ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద 53 వేల క్వింటాళ్లు మాత్రమే పంచదార దిగుబడి వచ్చే అవకాశం వుంది. పంచదార రికవరీ ఐదారు శాతానికి మించకపోవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రభావం వచ్చే సీజన్‌లో చెరకు మద్దతు ధర చెల్లింపుపై పడే అవకాశం వుంది.