కిక్కిరిసిన సింహగిరి
ABN , Publish Date - Nov 16 , 2025 | 01:55 AM
కార్తీక మాస బహుళపక్ష ఏకాదశి, శనివారం కావడంతో వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో సింహగిరి భక్తజనసంద్రమైంది.
అప్పన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
ఆలయానికి రూ.36.5 లక్షల ఆదాయం
సింహాచలం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):
కార్తీక మాస బహుళపక్ష ఏకాదశి, శనివారం కావడంతో వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో సింహగిరి భక్తజనసంద్రమైంది. శుక్రవారం రాత్రికే ఒడిశా సరిహద్దు గ్రామాలు, ఉత్తరాంరఽధ జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి, వరాహ పుష్కరిణిలో పవిత్ర సాన్నాలు ఆచరించారు. తొలిమెట్టు అప్పన్నస్వామి విగ్రహం వద్ద మహిళలు దీపారాధనలు చేశారు. సింహగిరికి చేరుకున్న భక్తులు గంగధారలో పవిత్ర స్నానాలు ఆచరించి సింహాద్రినాథుని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా అప్పన్న ఖజానాకు శనివారం ఇక్కరోజే సుమారు రూ.36.5 లక్షల ఆదాయం సమకూరింది. అత్యధికంగా శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం టికెట్ల ద్వారా సుమారు రూ.19.8లక్షలు లభించింది. ఈఓ సుజాత ఆధ్వర్యంలో డిప్యూటీ ఈఓ సింగం రాధ, ఏఈఓ కె.తిరుమలేశ్వరరావు రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు.