Share News

సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రద్దీ

ABN , Publish Date - May 14 , 2025 | 12:55 AM

అనకాపల్లి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం మంగళవారం వివిధ పనులపై వచ్చిన వారితో కిటకిటలాడింది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌తోపాటు వివాహ రిజిస్ర్టేషన్‌ కోసం పెద్ద సంఖ్యలు జనం వచ్చారు. కార్యాలయం హాలు చిన్నదిగా వుండడంతోపాటు తీవ్ర ఎండవేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. చెమటతో తడిసిముద్దయ్యారు.

సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రద్దీ
కిటకిటలాడుతున్న అనకాపల్లి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయం

మ్యారేజీ సర్టిఫికెట్ల కోసం పోటెత్తిన నూతన దంపతులు

ఒక్కో దరఖాస్తుకు ముగ్గురి సాక్షి సంతకాలు

కిటకిటలాడిన అనకాపల్లి కార్యాలయం

ఉక్కతపోతతో ఉక్కిరిబిక్కిరి

కొత్తూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం మంగళవారం వివిధ పనులపై వచ్చిన వారితో కిటకిటలాడింది. ఆస్తుల రిజిస్ట్రేషన్‌తోపాటు వివాహ రిజిస్ర్టేషన్‌ కోసం పెద్ద సంఖ్యలు జనం వచ్చారు. కార్యాలయం హాలు చిన్నదిగా వుండడంతోపాటు తీవ్ర ఎండవేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డారు. చెమటతో తడిసిముద్దయ్యారు. కార్యాలయంలోకి అడుగుపెట్టలేనంతగా జనంతో నిండిపోయింది. ప్రభుత్వం కొత్త దంపతులతోపాటు, రేషన్‌కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త దంపతులు దరఖాస్తుతోపాటు మ్యారేజీ సర్టిఫికెట్‌ను జత చేయాలి. దీంతో ఇటీవల కాలంలో వివాహాలు చేసుకున్న వారంతా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి వస్తున్నారు. దంపతులతోపాటు ప్రతి దరఖాస్తుకు ముగ్గురు సాక్షి సంతకాలు చేయాల్సి వుండడంతో ఒక్కో దరఖాస్తుకు ఐదుగురు చొప్పున వచ్చారు. దీంతో ఇరుకుగా వున్న హాలులో ఎక్కువసేపు వేచివుండాల్సి రావడంతో ఉక్కపోతకు గురయ్యారు. కొంతమందికి ఊపిరి ఆడక కాసేపటికోసారి బయటకు వెళ్లివచ్చారు. సిబ్బంది రాత్రి వరకు కార్యాలయంలోనే వుండి మ్యారేజీ సర్టిఫికేట్‌ కోసం స్లాట్‌ తీసుకున్న వారికి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ పూర్తి చేశారు. ఒక్క రోజే 92 మంది మ్యారేజ్‌ సర్టిఫికెట్లకు రిజిస్ర్టేషన్‌ చేసుకున్నట్టు సిబ్బంది తెలిపారు. ఇదిలావుండగా స్థానిక కార్యాలయంలో సబ్‌ రిజిస్ర్టార్‌-1 మాధవీకుమారి మూడు నెలలుగా సెలవులో ఉన్నారు. సబ్‌ రిజిస్ర్టార్‌-2 నిరంజన్‌ కుమార్‌ ఒక్కరే అన్ని రిజిస్ర్టేషన్లు చేయాల్సి వస్తున్నది.

Updated Date - May 14 , 2025 | 12:55 AM