పర్యాటకుల సందడి
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:18 AM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో గురువారం పర్యాటకుల సందడి నెలకొంది. వాతావారణం అనుకూలించడంతో పాటు క్రిస్మస్ సెలవులు కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చారు.
క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో పోటెత్తిన పర్యాటకులు
పాడేరు, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో గురువారం పర్యాటకుల సందడి నెలకొంది. వాతావారణం అనుకూలించడంతో పాటు క్రిస్మస్ సెలవులు కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు ఏజెన్సీ ప్రాంతానికి వచ్చారు. దీంతో గురువారం ఏజెన్సీలో ఎక్కడ చూసినా సందర్శకుల కోలాహలం కనిపించింది.
అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందడి నెలకొంది. బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల రద్దీ నెలకొంది. దీంతో అరకులోయ, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల హడావిడి కనిపించింది.
అరకులోయలో..
అరకులోయ: స్థానిక పద్మాపురం గార్డెన్, గిరిజన మ్యూజియానికి గురువారం పర్యాటకులు పోటెత్తారు. సందర్శకులు అధికంగా రావడంతో రాత్రి అయినప్పటికి నిర్వాహకులు అనుమతించారు. అలాగే వేకువజామున మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్‌ను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. గాలికొండ వ్యూపాయింట్, సుంకరమెట్ట కాఫీ తోటల్లో ఏర్పాటు చేసిన ఉడెన్ బ్రిడ్జి వద్ద రద్దీ నెలకొంది. ఇక్కడ ట్రాఫిక్ స్తంభించిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
చాపరాయి జలవిహారి వద్ద..
డుంబ్రిగుడ: మండలంలోని పర్యాటక కేంద్రమైన చాపరాయి జలవిహారికి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఉదయం నుంచి ఇక్కడ సందడి నెలకొంది. జల విహారిలో స్నానాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించడంతో పాటు థింసా నృత్యాలు చేస్తూ పలువుర పర్యాటకులు ఎంజాయ్ చేశారు.