పర్యాటకుల సందడి
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:37 PM
ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. గొలుగొండ మండలంలోని దారమఠం పర్యాటక కేంద్రం వద్ద పర్యాటకుల కోలాహలం కనిపించింది.
పర్యాటక ప్రాంతాలు కిటకిట
గొలుగొండ, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. గొలుగొండ మండలంలోని దారమఠం పర్యాటక కేంద్రం వద్ద పర్యాటకుల కోలాహలం కనిపించింది. మండలంలోని పాతమల్లంపేట గ్రామంలో గల దారమఠం ఉమాదారమల్లేశ్వరస్వామి ఆలయం వద్ద నిత్యం జలజలపారే జలపాతంలో స్నానాలు చేసి శివుడిని దర్శించుకున్నారు. ఇక్కడ అటవీ ప్రాంతం కావడంతో ఆహ్లాదకరంగా ఉండడంతో సాయంత్రం వరకు పర్యాటకులు సంతోషంగా గడిపారు. మధ్యాహ్నం వనభోజనాలు చేశారు.
తీర ప్రాంతంలో..
పరవాడ: ముత్యాలమ్మపాలెం, తిక్కవానిపాలెం తీరాల్లో ఆదివారం పిక్నిక్ సందడి నెలకొంది. జిల్లా నలుమూలల నుంచి పర్యాటకుల ఇక్కడికి తరలివచ్చారు. తీరం సమీపంలో గల జీడిమామిడి తోటల్లో వన భోజనాలు చేశారు. పర్యాటక ప్రాంతంగా గుర్తింపు వున్నప్పటికీ ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కనీస వసతులు అంతంత మాత్రమే ఉన్నాయి. దీంతో తీరానికి వచ్చే సందర్శకులకు అవస్థలు తప్పడం లేదు.
అల్లూరి జిల్లాలో..
పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సందర్శనీయ ప్రదేశాలకు ఆదివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి రైలు మార్గంలో అరకులోయకు అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు పర్యాటక సందడి నెలకొంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాలకొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలకు అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.