Share News

పర్యాటకుల సందడి

ABN , Publish Date - Nov 24 , 2025 | 12:04 AM

ప్రముఖ పర్యాటక కేంద్రం బొజ్జన్నకొండ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు.

పర్యాటకుల సందడి
రేవుపోలవరం సముద్రతీరంలో సందడి చేస్తున్న పర్యాటకులు

పిక్నిక్‌ సీజన్‌ కావడంతో పర్యాటక ప్రాంతాల్లో కోలాహలం

తుమ్మపాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పర్యాటక కేంద్రం బొజ్జన్నకొండ వద్ద ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. పిక్నిక్‌ సీజన్‌ కావడంతో అనకాపల్లి మండలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు బొజ్జన్నకొండ వద్దకు చేరుకున్నారు. కొండపై గల చారిత్రాత్మక శిలా సంపదను తిలకించి ఫొటోలు తీసుకున్నారు. అలాగే దిగువన ఉన్న మైదానంలో ఆటపాటలతో ఆనందంగా గడిపారు. మధ్యాహ్నం అందరూ వన భోజనాలు చేశారు.

ముత్యాలమ్మపాలెం తీరంలో..

పరవాడ: మండలంలోని ముత్యాలమ్మపాలెం తీరం ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. ప్రతి ఏడాది కార్తీకమాసం ప్రారంభం నుంచి డిసెంబరు నెలాఖరు వరకు జిల్లా నలుమూలల నుంచి పర్యాటకులు తీరానికి వస్తుంటారు. తీరానికి ఆనుకొని ఉన్న చామలకొండ, దిగువన ఉన్న జీడి మామిడితోటలు పిక్నిక్‌ స్పాట్‌కు గుర్తింపు పొందాయి. గాజువాక, మల్కాపురం, కూర్మన్నపాలెం, అనకాపల్లి, చోడవరం తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు ముత్యాలమ్మపాలెం తీరానికి వచ్చి సరదాగా గడిపారు. మధ్యాహ్నం వనభోజనాలు ముగించుకొని తీరంలో సందడి చేశారు.

రేవుపోలవరం తీరంలో...

ఎస్‌.రాయవరం: మండలంలోని రేవుపోలవరం సముద్రతీరం ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. ఉదయం నుంచే పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆటపాటలతో సరదాగా గడిపారు. మధ్యాహ్నం అక్కడ చుట్టుపక్కల ఉన్న కొబ్బరి, జీడిమామిడి తోటల్లో వనభోజనాలు చేసి అనంతరం తీరంలో స్నానాలు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా ఎస్‌ఐ విభీషణరావు ఆధ్వర్యంలో పోలీసులు డ్రోన్‌తో నిఘా పెట్టి పర్యవేక్షించారు. అలాగే మెరైన్‌ పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు గస్తీ నిర్వహించారు.

Updated Date - Nov 24 , 2025 | 12:04 AM