పర్యాటకుల సందడి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:33 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకులు పోటెత్తారు. కార్తీక మాసం కావడంతో పిక్నిక్‌ల సందడి నెలకొంది. ఆదివారం ఏజెన్సీలో ఎక్కడ చూసినా పర్యాటకులే కనిపించారు.
మన్యంలోని పర్యాటక ప్రాంతాలు రద్దీ
పిక్నిక్ సీజన్ కావడంతో అధిక సంఖ్యలో వచ్చిన సందర్శకులు
పాడేరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలకు పర్యాటకులు పోటెత్తారు. కార్తీక మాసం కావడంతో పిక్నిక్‌ల సందడి నెలకొంది. ఆదివారం ఏజెన్సీలో ఎక్కడ చూసినా పర్యాటకులే కనిపించారు. అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలంలోని లంబసింగి వరకు సందడి మొదలైంది. అనంతగిరి మండలంలో బొర్రా గుహలు, కటికి, తాడిగుడ జలపాతాలు, అరకులోయ మండలంలో మాడగడ మేఘాల కొండ, గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, గిరి గ్రామదర్శిని, ఆయా ప్రాంతాల్లోని వలిసె పూల తోటలు, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి గెడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాజంగి రిజర్వాయర్, చెరువువేనం మేఘాల కొండ, లంబసింగి, యర్రవరం జలపాతం తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు.
వంజంగి మేఘాల కొండపై...
పాడేరురూరల్: మండలంలోని వంజంగి మేఘాల కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. మేఘాల పర్వతాన్ని తిలకించేందుకు మైదాన ప్రాంతం నుంచి వందలాది మంది పర్యాటకులు శనివారం సాయంత్రానికే పాడేరు చేరుకొని రాత్రి బస చేసి ఆదివారం వేకువజామున మేఘాల కొండకు చేరుకున్నారు. మంచు అందాలను తిలకించి పరవశించిపోయారు. ఆదివారం వంజంగి మేఘాల పర్వతాన్ని 1,513 వందల మంది పర్యాటకులు సందర్శించగా, రూ.81,260 ఆదాయం వచ్చిందని ఎకో టూరిజం నిర్వాహకులు తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఎకో టూరిజం ఏర్పడిన తరువాత మొదటి సారి అత్యధిక ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.
అరకులోయలో...
అరకులోయ: మండలంలోని పర్యాటక ప్రాంతాల్లో ఆదివారం సందడి నెలకొంది. అరకులోయలోని గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, గాలికొండ వ్యూపాయింట్‌ను అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. వేకువజాము నుంచే మాడగడ సన్‌రైజ్ వ్యూపాయింట్ వద్ద కోలాహలం కనిపించింది. అక్కడ మంచు అందాలను పర్యాటకులు ఆస్వాదించారు. థింసా కళాకారుల నృత్యాలు అలరించాయి.
లంబసింగిలో...
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటక సీజన్, ఆదివారం కావడంతో లంబసింగి ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. కొంత మంది పర్యాటకులు ముందు రోజే లంబసింగి వచ్చి స్థానికంగా బస చేశారు. మరికొందరు వ్యక్తిగత, సర్వీసు వాహనాల్లో ఆదివారం ఉదయం ఐదు గంటలకు చేరుకున్నారు. చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులు మంచు అందాలను తిలకిస్తూ ఎంజాయ్ చేశారు. ప్రకృతి అందాలను కెమెరాలో బంధించేందుకు పోటీ పడ్డారు. ఉదయం నుంచి పదకొండు గంటల వరకు లంబసింగి జంక్షన్, చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద పర్యాటకులు సందడి చేశారు. తాజంగి జలాశయంలో సాహస కీడల్లో పాల్గొనేందుకు సందర్శకులు ఆసక్తి చూపారు. యర్రవరం జలపాతాన్ని సైతం అధిక పర్యాటకులు సందర్శించారు. లంబసింగి పరిసర పర్యాటక ప్రాంతాలు సాయంత్రం వరకు రద్దీగా కనిపించాయి.