Share News

పర్యాటకుల సందడి

ABN , Publish Date - Oct 26 , 2025 | 10:59 PM

ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఏజెన్సీలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు సందర్శకులతో కోలాహలంగా ఉన్నాయి.

పర్యాటకుల సందడి
చెరువులవేనంలో పర్యాటకులు

కార్తీక మాసం కావడంతో కోలాహలం

పాడేరు, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో ఏజెన్సీలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం మన్యంలోని సందర్శనీయ ప్రదేశాలు సందర్శకులతో కోలాహలంగా ఉన్నాయి. అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల రద్దీ కనిపించింది. అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయలో గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, గాలికొండ వ్యూపాయింట్‌, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, తదితర ప్రాంతాల్లో పర్యాటకుల తాకిడి కనిపించింది.

లంబసింగిలో...

చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. పర్యాటక సీజన్‌ ప్రారంభం కావడంతో ఆదివారం లంబసింగికి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. కొంతమంది పర్యాటకులు ముందు రోజే లంబసింగి వచ్చి బస చేయగా, మెజారిటీ పర్యాటకులు వ్యక్తిగత, ప్రైవేటు వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉదయం ఐదు గంటలకు లంబసింగి చేరుకున్నారు. చెరువులవేనం వ్యూపాయింట్‌, లంబసింగి జంక్షన్‌లో పర్యాటకులు మంచు అందాలను తిలకించి ఎంజాయ్‌ చేశారు. ఉదయం 11 గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్‌ రద్దీగా కనిపించింది. అలాగే తాజంగి జలాశయం వద్ద పర్యాటకులు సాహస క్రీడల్లో పాల్గొనేందుకు పోటీ పడ్డారు. వాతావరణం సహకరించడంతో పర్యాటకులు సాయంత్రం వరకు లంబసింగి పరిసర ప్రాంతాల్లో సందడి చేశారు. యర్రవరం జలపాతాన్ని సైతం పర్యాటకులు అధిక సంఖ్యలో సందర్శించారు.

అరకులోయలో...

అరకులోయ: స్థానిక పద్మాపురం గార్డెన్‌, గిరిజన మ్యూజియంతో మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ను పర్యాటకులు సందర్శించారు. అలాగే సుంకరమెట్ట ఉడెన్‌ బ్రిడ్జి, గాలికొండ వ్యూపాయింట్‌ వద్ద సందడి చేశారు.

జలవిహారిలో..

డుంబ్రిగుడ : మండలంలోని పర్యాటక ప్రాంతాలు చాపరాయి జల విహారి, అరకు పైనరీ, కొల్లాపుట్టు జలతరంగిణి అందాలను తిలకించేందుకు మైదాన ప్రాంతం నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. చాపరాయి జలవిహారి వద్ద స్నానాలు చేసి సందడి చేశారు. అరకు పైనరీలో ఎత్తైన చెట్ల మధ్య పూలవనంలో సెల్ఫీలు దిగి సాయంత్రం వరకు ఉల్లాసంగా గడిపారు.

Updated Date - Oct 26 , 2025 | 10:59 PM