పర్యాటకుల సందడి
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:01 PM
మన్యంలో పర్యాటకుల సందడి నెలకొంది. కార్తీక మాసం సమీపిస్తుండడంతో పర్యాటక సీజన్ క్రమంగా మొదలవుతున్నది.
మన్యంలోని సందర్శనీయ ప్రాంతాలు రద్దీ
వరుస సెలవులు రావడంతో కోలాహలం
పాడేరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): మన్యంలో పర్యాటకుల సందడి నెలకొంది. కార్తీక మాసం సమీపిస్తుండడంతో పర్యాటక సీజన్ క్రమంగా మొదలవుతున్నది. ఆదివారం మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో పర్యాటకుల రద్దీ కనిపించింది. ప్రస్తుత వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకులతో కిటకిటలాడింది. ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయలో గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, గాలికొండ వ్యూపాయింట్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో లంబసింగి ప్రాంతాలను సందర్శించారు.
అరకులోయలో...
అరకులోయ: వరుస సెలవులు రావడంతో అరకులోయకు అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఆదివారం, సోమవారం దీపావళి సెలవులు రావడంతో గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, సుంకరమెట్ట కాఫీ తోటల్లో కాఫీ ట్రయల్ (కెనోపివాక్- ఉడెన్‌బ్రిడ్జి), గాలికొండ వ్యూపాయింట్ వద్ద సందడి నెలకొంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు వర్షం కురుస్తున్నా సందర్శకుల తాకిడి తగ్గలేదు.
కొత్తపల్లి జలపాతంలో...
జి.మాడుగుల: మండలంలోని కొత్తపల్లి జలపాతంలో ఆదివారం ఐఏఎస్ అధికారులు సందడి చేశారు. పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా సబ్ కలెక్టర్ వైశాలి, జైపూర్ సబ్ కలెక్టర్ సస్యరెడ్డి జలపాతాన్ని సందర్శించారు. జలపాతంలో స్నానాలు చేసి ఉత్సాహంగా గడిపారు.
లంబసింగిలో...
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం తేలికపాటి వర్షం కురుస్తున్నప్పటికి పర్యాటకులు చెరువులవేనం, తాజంగి జలాశయం, లంబసింగి జంక్షన్‌లో ప్రకృతి అందాలను వీక్షించారు. అయితే వర్షం కారణంగా చెరువులవేనంలో మంచు అందాలు కనుమరుగయ్యాయి. అయినప్పటికి చెరువులవేనం వ్యూపాయింట్ వద్ద 11 గంటల వరకు పర్యాటకులు ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ ఆనందంగా గడిపారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపారు. సాయంత్రం వరకు పర్యాటక ప్రాంతాలు రద్దీగా కనిపించాయి. అలాగే యర్రవరం జలపాతాన్ని సైతం అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు.