పర్యాటకుల సందడి
ABN , Publish Date - Oct 05 , 2025 | 10:32 PM
బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏజెన్సీలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆదివారం పర్యాటకుల సందడి తగ్గలేదు. వాస్తవానికి శనివారం సైతం మన్యానికి అధిక సంఖ్యలోనే పర్యాటకులు విచ్చేశారు.
వర్షంలోనూ తగ్గని కోలాహలం
పాడేరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏజెన్సీలో వర్షాలు కురుస్తున్నప్పటికీ ఆదివారం పర్యాటకుల సందడి తగ్గలేదు. వాస్తవానికి శనివారం సైతం మన్యానికి అధిక సంఖ్యలోనే పర్యాటకులు విచ్చేశారు. దసరా పండుగ ముగియడం, వీకెండ్ కావడంతోపాటు వాతావరణం సైతం ఆహ్లాదకరంగా ఉండడంతో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల సందడి నెలకొంది. ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయలో గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, గాలికొండ వ్యూపాయింట్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారీ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో లంబసింగి ప్రాంతాలను ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు.
లంబసింగిలో..
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటక సీజన్ ప్రారంభం కావడంతో ఆదివారం లంబసింగికి అత్యధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి చెరువులవేనం వ్యూపాయింట్, లంబసింగి జంక్షన్ వద్ద పర్యాటకులు సందడి చేశారు. చెరువులవేనంలో మంచు అందాలను వీక్షిస్తూ ఎంజాయ్ చేశారు. ఉదయం 11 గంటల వరకు చెరువులవేనం పర్యాటకులతో రద్దీగా కనిపించింది. అలాగే తాజంగి జలాశయం వద్ద పర్యాటకులు సాహస క్రీడల్లో పాల్గొనేందుకు పోటీపడ్డారు. సాయంత్రం వరకు లంబసింగి పరిసర ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా కనిపించాయి. అలాగే యర్రవరం జలపాతానికి సైతం పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
చాపరాయి జలవిహారిలో..
డుంబ్రిగుడ: ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారిలో పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడ సరదాగా గడిపారు. ఈ నెల 2 నుంచి ఆదివారం వరకు 5,022 మంది పర్యాటకులు రాగా, రూ.2.76 లక్షల ఆదాయం వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.
బొర్రా గుహల వద్ద..
అనంతగిరి: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రా గుహలకు ఆదివారం రెండు వేల మంది పర్యాటకులు సందర్శించారు. రూ.2.5 లక్షల ఆదాయం వచ్చిందని యూనిట్ మేనేజర్ గౌరీ శంకర్ తెలిపారు. అలాగే కటికి, తాటిగుడ, సరియా జలపాతాలు, కాఫీ ప్లాంటేషన్ తదితర సందర్శనీయ ప్రాంతాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడాయి.