Share News

పర్యాటకుల సందడి

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:06 PM

ఏజెన్సీలో పర్యాటక ప్రదేశాల్లో ఆదివారం సందర్శకుల తాకిడి నెలకొంది. మన్యంలో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల సందడి కనిపించింది.

పర్యాటకుల సందడి
మాడగడ వ్యూపాయింట్‌ వద్ద సందర్శకులు

సందర్శనీయ ప్రాంతాలు రద్దీ

పాడేరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీలో పర్యాటక ప్రదేశాల్లో ఆదివారం సందర్శకుల తాకిడి నెలకొంది. మన్యంలో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల సందడి కనిపించింది. ప్రస్తుతం దసరా సెలవులతో పాటు వీకెండ్‌ కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయలో గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌, గాలికొండ వ్యూపాయింట్‌, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారి, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో లంబసింగి ప్రాంతాలను ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఐటీడీఏ పీవో శ్రీపూజ కుటుంబీకులతో కలిసి కొత్తపల్లి జలపాతాన్ని సందర్శించగా, జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ కుటుంబంతో కలిసి పెదబయలు మండలం తారాబు జలపాతాన్ని సందర్శించారు.

మాడగడలో..

అరకులోయ: మాడగడ సన్‌రైజ్‌ వ్యూపాయింట్‌ వద్ద సందర్శకుల సందడి నెలకొంది. ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి థింసా కళాకారులతో కలిసి నృత్యం చేసి ఫొటోలు దిగారు. కొందరు గిరిజన మహిళల వేషధారణ, వస్త్రధారణ చేసి ఎంజాయ్‌ చేశారు. అలాగే అరకులోయ పట్టణంలోని గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్‌తో పాటు ఘాట్‌రోడ్డులో ఉన్న సుంకరమెట్ట కాఫీ ట్రయల్‌ (ఉడెన్‌ బ్రిడ్జి), గాలికొండ వ్యూపాయింట్‌ను సందర్శించారు. పద్మాపురం గార్డెన్‌లో హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో ప్రయాణించి సందడి చేశారు.

లంబసింగిలో..

చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్‌ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. వాతావరణం అనుకూలించడం, పర్యాటక సీజన్‌ సమీపిస్తుండడంతో లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు వస్తున్నారు. ఆదివారం లంబసింగికి అధిక సంఖ్యలో పర్యాటకులు తరలి వచ్చారు. కొందరు పర్యాటకులు ముందు రోజే లంబసింగి వచ్చి బస చేయగా, మరికొందరు ఉదయం నాలుగు గంటలకు వాహనాల్లో ఇక్కడికి వచ్చారు. ఉదయం ఐదు గంటల నుంచి 11 గంటల వరకు చెరువులవేనం వ్యూపాయింట్‌ వద్ద పర్యాటకులు సందడి చేశారు. అనంతరం తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొన్నారు. అలాగే యర్రవరం జలపాతానికి అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చారు.

కొత్తపల్లి జలపాతం వద్ద..

జి.మాడుగుల: కొత్తపల్లి జలపాతాన్ని అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు. ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చారు. సహజసిద్ధంగా ఏర్పడిన జలపాతం అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు.

బొంగడారి జలపాతం వద్ద..

పెదబయలు: మండలంలోని అరడకోట, వనభంగి పంచాయతీల మధ్య గల బొంగడారి జలపాతాన్ని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ జలపాతం పర్యాటకంగా మంచి అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం బొంగడారి గ్రామంలోని పాఠశాలలో స్థానిక నాయకులు, ప్రజలతో మాట్లాడారు. గ్రామానికి వచ్చిన కలెక్టర్‌కు రెండు పంచాయతీల గిరిజనులు పుష్పగుచ్ఛాలు అందించి దుశ్శాలువాతో సత్కరించారు. జలపాతం దిగువ భాగంలో కల్వర్టు ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు కోరారు. అలాగే మూడు పంచాయితీలకు ప్రధాన రహదారి అయిన జలపాతం రహదారిలో రెండు చోట్లా సీసీ రోడ్లు ధ్వంసం కావడంతో ప్రయాణాలకు ఇబ్బందిగా మారిందని, ధ్వంసం అయిన సీసీ రోడ్లను పునర్నిర్మించాలని, వనభంగి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న అంగన్‌వాడీ భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని వారు కోరారు. ఈ సమస్యలపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. వాటి నిర్మాణానికి అంచనా తయారు చేసి తనకు ఇవ్వాలని సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను ఆయన ఆదేశించారు. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఖాళీగా ఉన్న ఆయా పోస్టు భర్తీకి స్థానికులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అనంతరం స్థానిక నాయకులతో కలసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆయన వెంట అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 11:06 PM