పర్యాటకుల సందడి
ABN , Publish Date - Sep 07 , 2025 | 11:00 PM
మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో ఆదివారం పర్యాటకులతో సందడి నెలకొంది. ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావుడి నెలకొంది.
ప్రకృతి అందాలకు ఫిదా
పాడేరు, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మన్యంలోని సందర్శనీయ ప్రదేశాల్లో ఆదివారం పర్యాటకులతో సందడి నెలకొంది. ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు మొదలుకుని చింతపల్లి మండలం లంబసింగి వరకు సందర్శకుల హడావుడి నెలకొంది. ప్రస్తుతం వర్షాకాలమైనప్పటికీ ఏజెన్సీలోని ప్రకృతి అందాలు సుందరంగా ఉండడంతో వాటిని తిలకించేందుకు పర్యాటకులు వస్తున్నారు. ఏజెన్సీలో అనంతగిరి మండలం బొర్రా గుహలు, అరకులోయలో గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్, గాలికొండ వ్యూపాయింట్, డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలవిహారీ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, జి.మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో లంబసింగి ప్రాంతాలను ఆదివారం అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించారు.
మినుములూరు కాఫీ తోటల్లో..
పాడేరురూరల్: పాడేరు పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి మొదలైంది. ఈ ప్రాంతంలోని మినుములూరు కాఫీ తోటలు, వంజంగి మేఘాల కొండ, కొత్తపల్లి జలపాతం, తదితర పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. మైదాన ప్రాంతం నుంచి ఆదివారం పాడేరు ప్రాంతానికి వచ్చే పర్యాటకులు పాడేరు ఘాట్ మార్గంలో కురుస్తున్న మంచుకు ఫిదా అయ్యారు. అదే విధంగా మోదకొండమ్మవారి పాదాలు సమీపంలో ఉన్న కాఫీ తోటల్లో ప్రకృతి అందాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు.
లంబసింగిలో..
చింతపల్లి: ఆంధ్ర కశ్మీర్ లంబసింగిలో పర్యాటకులు సందడి చేశారు. పర్యాటక సీజన్ సమీపిస్తుండడంతో పర్యాటకులు లంబసింగి ప్రకృతి అందాలను వీక్షించేందుకు వస్తున్నారు. ఆదివారం లంబసింగి వచ్చిన పర్యాటకులు చెరువులవేనం వ్యూపాయింట్‌ను సందర్శించారు. తాజంగి జలాశయం వద్ద సాహస క్రీడల్లో పాల్గొన్నారు. వాతావరణం అనుకూలించడంతో పర్యాటకులు ఎంజాయ్ చేశారు.