స్టాండింగ్ కమిటీఎన్నికల్లో క్రాస్ ఓటింగ్!
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:16 AM
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమికి గట్టి షాక్ తగిలింది. కౌన్సిల్‌లో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఒక స్థానం కోల్పోవడం నేతలను అవాక్కయ్యేలా చేసింది. కౌన్సిల్‌లో ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉండగా, వారిలో కూటమి మద్దతుదారులు 63 మంది ఉన్నారు. వైసీపీకి 32 మంది, సీపీఐ, సీపీఎంలకు ఒక్కొక్క కార్పొరేటర్ ఉన్నారు.
పూర్తి మెజారిటీ ఉన్నా కూటమి చేజారిన ఒక స్థానం
32 మంది సభ్యులే ఉన్నా 50 ఓట్లతో ఆ స్థానాన్ని దక్కించుకున్న వైసీపీ
పార్టీ నేతలపై కూటమి కార్పొరేటర్లలో అసంతృప్తే కారణం
ఎమ్మెల్యేలు పట్టించుకోకపోవడం మరో కారణం
విశాఖపట్నం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమికి గట్టి షాక్ తగిలింది. కౌన్సిల్‌లో పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఒక స్థానం కోల్పోవడం నేతలను అవాక్కయ్యేలా చేసింది. కౌన్సిల్‌లో ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉండగా, వారిలో కూటమి మద్దతుదారులు 63 మంది ఉన్నారు. వైసీపీకి 32 మంది, సీపీఐ, సీపీఎంలకు ఒక్కొక్క కార్పొరేటర్ ఉన్నారు.
స్టాండింగ్ కమిటీలో పది మంది సభ్యులను ఎన్నుకునేందుకు బుధవారం పోలింగ్ జరిగింది. వీరిలో ఐదుగురు (కూటమికి చెందినవారు) గైర్హాజరు కాగా, 92 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికవ్వాలంటే కనీసం 46 ఓట్లు దక్కించుకోవాల్సి ఉండడంతో కూటమి అభ్యర్థుల గెలుపు లాంఛనమేనని అంతా భావించారు. వైసీపీ సభ్యులు కూడా మొక్కుబడిగా పోటీకి దిగారు. కానీ అనూహ్యంగా వైసీపీ తరఫున పోటీకి దిగిన పది మందిలో ఒకరైన సాడి పద్మారెడ్డి గెలుపొందడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అత్యధిక ఓట్లు సాధించిన మొదటి పది మందిని విజేతలుగా అధికారులు ప్రకటిస్తారు. కూటమి తరఫున పోటీ చేసిన తొమ్మిది మందికి 51 కంటే ఎక్కువ ఓట్లు దక్కగా, వారి తర్వాత వైసీపీకి చెందిన సాడి పద్మారెడ్డి 50 ఓట్లు దక్కించుకుని పదో స్థానంలో నిలవడంతో ఆమె ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. కౌన్సిల్‌లో వైసీపీకి 32 మంది సభ్యుల బలం ఉంది. అయితే కూటమి కార్పొరేటర్లు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడడంతో పద్మారెడ్డికి అదనంగా 18 ఓట్లు పడ్డాయి. కూటమిలో అనైక్యత, అసమ్మతి ఇందుకు కారణమని అంటున్నారు.
కూటమి కార్పొరేటర్లలో తీవ్ర అసంతృప్తి
అధికారపక్షంలోకి మారిన తర్వాత కూటమి కార్పొరేటర్లలో అసంతృప్తి తీవ్రస్థాయికి పెరిగిపోయింది. ప్రధానంగా జనసేనకు చెందిన కొందరు కార్పొరేటర్లు కూటమి ఎమ్మెల్యేలు, పాలకవర్గంలోని పెద్దల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. జనసేనకు చెందిన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్‌కు, ఆ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యేకు ప్రత్యక్షంగానే వార్ నడుస్తోంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకుంటున్నారు. కూటమి నేతలుగానీ, పాలకవర్గం పెద్దలుగానీ తనకు కనీసం సహాయం అందించడం లేదని మూర్తియాదవ్ అసంతృప్తితో ఉన్నారు. జనసేన స్థానిక నాయకత్వం తీరుకు నిరసనగా స్టాండింగ్ కమిటీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మరోవైపు బెహరా భాస్కరరావు మేయర్ ఉప ఎన్నికకు ముందు వైసీపీ నుంచి జనసేనలో చేరారు. ఆ సమయంలో తనకు ఇచ్చిన హామీలను కూటమి నేతలు నెరవేర్చలేదని, స్థానిక టీడీపీ నేత నుంచి తనకు అవమానాలు ఎదురవుతున్నాయంటూ బహిరంగంగానే నేతల వద్ద అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. బుధవారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఆయన కుటుంబంలోని ఇద్దరు కార్పొరేటర్లు గైర్హాజరవ్వడానికి కారణం అదేనని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచి జనసేనలో చేరిన ఒక కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరుతూ మెసేజ్‌లు పెట్టినట్టు టీడీపీ కార్పొరేటర్లు చెబుతున్నారు. మరోవైపు వైసీపీ నుంచి జనసేన, టీడీపీల్లో చేరిన కార్పొరేటర్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల వ్యహారశైలిపై అసంతృప్తితో ఉన్నారు. తాము పార్టీ మారినప్పటికీ ఇప్పటికీ వైసీపీ కార్పొరేటర్లుగానే భావిస్తున్నారని, తమ చేతిలో ఓటమి పాలైన వారిని వార్డుల్లో కార్యక్రమాలకు పిలిచి తమను అవమానపరుస్తారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వారిలో కొందరు వైసీపీకి అనుకూలంగా ఓటేసి ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు సైతం ప్రస్తుతం పాలకవర్గంలోని నేతల తీరుపై గుర్రుగా ఉన్నారని, వారు కూడా స్టాండింగ్ కమిటీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల పరిధిలోని కొందరు కార్పొరేటర్ల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. అందుకే స్టాండింగ్ కమిటీ ఎన్నికల గురించి పట్టించుకోలేదని, అది కూడా పోలింగ్‌పై ప్రభావం చూపి, అభ్యర్థి ఓటమికి కారణంగా మారిందని అంటున్నారు.