Share News

నత్తలతో పంటలు నాశనం

ABN , Publish Date - Nov 30 , 2025 | 12:00 AM

మండలంలోని కొండపాలెం, కేపీ అగ్రహారం, ఐతంపూడి, పి.భీమవరం గ్రామాల్లో కోతులు, అడవి పందులతో పాటు నత్తల బెడద ఎక్కువైంది.

నత్తలతో పంటలు నాశనం
పగటి వేళ అరటి చెట్టులో దాక్కున్న నత్తలు

కొండపాలెం, కేపీ అగ్రహారం, ఐతంపూడి, పి.భీమవరం గ్రామాల్లో వీటి బెడద అధికం

తీవ్రంగా నష్టపోతున్న రైతులు

నివారణకు చర్యలు తీసుకోవాలని వేడుకోలు

బుచ్చెయ్యపేట నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండపాలెం, కేపీ అగ్రహారం, ఐతంపూడి, పి.భీమవరం గ్రామాల్లో కోతులు, అడవి పందులతో పాటు నత్తల బెడద ఎక్కువైంది. నత్తలు ఆకుల రసం పీల్చి పంటలకు నాశనం చేస్తున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. కేపీ అగ్రహారం పరిధిలో మాజీ డిప్యూటి కలెక్టర్‌ 25 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ జీడి పప్పు, పప్పు ధాన్యాలు, పండ్ల తోటలు, కొబ్బరి చెట్లు వేయగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కేపీ అగ్రహారం, కొండపాలెంలో నత్తల బెడద అధికంగా ఉందని, కేపీ అగ్రహారంలో సుమారు 100 ఎకరాల వరి చేను, దీంతో పాటు పప్పు ధాన్యాలు, పండ్ల మొక్కలు నాశనమయ్యాయని సర్పంచ్‌ గోపిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే కొండపాలెంలో షేక్‌ బాబ్జీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అన్ని రకాల పంటలు సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. జీడితోటలో అంతర పంటగా బంతిపూల సాగు చేస్తున్న ఆయనకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రాత్రిపూట నత్తలు పూర్తిగా పంటలను నాశనం చేస్తున్నాయని కొండపాలెం సర్పంచ్‌ ముచ్చకర్ల భవాని తెలిపారు. అంతే కాకుండా ఇళ్లల్లో పెంచుకొనే పూల మొక్కలు, బొప్పాయి, కొబ్బరి, పండ్ల రకాల మొక్కలను నత్తలు నాశనం చేస్తున్నాయని చెప్పారు. చివరకు సరుగుడు తోలు కూడా నాశనమవుతున్నాయన్నారు. రైతులు కుటుంబ సమేతంగా వెళ్లి నత్తలను సేకరించి చంపుతున్నా ఫలితం లేకుండా పోతుందని, వీటి బెడద రోజు రోజుకూ పెరుగుతుందన్నారు. వీటి నివారణకు చర్యలు తీసుకోకపోతే మండల వ్యాప్తంగా ఇవి వ్యాప్తి చెందుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Nov 30 , 2025 | 12:00 AM