కాఫీ రైతులకు పంట నష్టపరిహారం
ABN , Publish Date - Sep 04 , 2025 | 11:43 PM
మన్యంలో కాఫీ పంటను నష్టపోయిన రైతులకు కిలో రూ.50 చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
కిలో కాఫీ గింజలకు రూ.50 చొప్పున ఇవ్వాలి
అధికారులకు కలెక్టర్ సూచన
పాడేరు, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మన్యంలో కాఫీ పంటను నష్టపోయిన రైతులకు కిలో రూ.50 చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. మన్యంలో కాఫీపై ముఖ్యమైన అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అరకులోయ మండలం చినలబుడు పంచాయతీ పరిధిలో పకనకుడి, తురాయిగూడ, మాలిసింగారం, తుడిము, చినలబుడు, మాలివలస గ్రామాల్లో కాఫీ పంటకు బెర్రీ బోరర్ సోకిందని గుర్తించారన్నారు. ఈ క్రమంలో దాని వ్యాప్తిని గుర్తించి, ఆయా కాఫీ తోటలను రెడ్, ఆరెంజ్, ఎల్లో, బ్లూ ప్లాగ్స్ ఏర్పాటు చేసి అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఏజెన్సీలో మరే ప్రాంతంలోనైనా బెర్రీ బోరర్ సోకిందా? అనే దానిపైనా ప్రత్యేక శ్రద్ధకనబరచాలన్నారు. కాఫీ పంటకు నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో గ్రామ సభలను నిర్వహించిన కిలో కాఫీ గింజలకు రూ.50 చొప్పున నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. ఎక్కువ మొత్తంలో పంట నష్టం జరిగితే, వాటిని భూమిలో పూడ్చిపెట్టేందుకు ఎకరానికి రూ.5 వేలు చొప్పున రైతులకు అందించాలన్నారు. అయితే ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అమిత్‌బర్ధార్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, సీపీవో ప్రసాద్, కాఫీ బోర్డు ఇన్‌చార్జి డీడీ రమేశ్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా మేనేజర్ ఎల్.భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.