క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభానికి సిద్ధం
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:02 AM
అనకాపల్లిలోని ఎన్టీఆర్ వైద్యాలయం ఆవరణలో రూ.22 కోట్లతో చేపట్టిన క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 50 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ భవనం ప్రారంభానికి సిద్ధమైంది.
ఎన్టీఆర్ వైద్యాలయం ఆవరణలో భవన నిర్మాణం పూర్తి
అందుబాటులోకి రానున్న అత్యవసర వైద్య సేవలు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
అనకాపల్లిలోని ఎన్టీఆర్ వైద్యాలయం ఆవరణలో రూ.22 కోట్లతో చేపట్టిన క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 50 పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ఇది అందుబాటులోకి వస్తే రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలపాలైన వారు, అత్యవసర వైద్యం అవసరమైన గర్భిణులు, అనారోగ్యంతో విషమ పరిస్థితిలో ఉన్న రోగులకు సేవలు అందనున్నాయి.
క్లిష్టతర రోగుల వైద్య సేవల విభాగం (క్రిటికల్ కేర్ సెంటర్) భవన నిర్మాణ పనులను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్ విజయకృష్ణన్ చొరవతో పనులు పునఃప్రారంభమయ్యాయి. మూడంతస్థుల సువిశాలమైన భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో అత్యవసర వార్డు, స్కానింగ్, రక్త పరీక్షల ల్యాబ్, మందులిచ్చే గదులు ఏర్పాటు చేసేవిధంగా నిర్మించారు. మొదటి అంతస్థులో గర్భిణులు ఉండేందుకు వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. రెండవ అంతస్థులో డయాలసిస్ సెంటర్‌తో పాటు ప్రమాదాల్లో తీవ్రమైన గాయాలపాలైన వారికి చికిత్సలు అందించేందుకు వీలుగా గదులను నిర్మించారు. మూడవ అంతస్థులో ఆధునిక వసతి సౌకర్యాలతో శస్త్ర చికిత్స గదులు నిర్మించారు. ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రికి అనుసంధానంగా పనిచేయనున్న క్రిటికల్ కేర్ సెంటర్‌లో వైద్య సేవలు అందించేందుకు అత్యవసర వైద్య నిపుణుల పోస్టులు భర్తీ చేయనున్నారు.
ప్రారంభానికి ఏర్పాట్లు
రెండు వారాల్లో క్రిటికల్ కేర్ సెంటర్ భవనాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ విభాగాల్లో రూ.12 కోట్లు విలువ చేసే అత్యాధునిక వైద్య సామగ్రిని సమకూర్చనున్నారు. ఇప్పటికే సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు స్కానర్, సీటీసీ, డిజిటల్ ఎక్స్‌రే వంటి అధునాతన పరికరాలు చేరాయి. త్వరలో వివిధ విభాగాల్లో వీటిని అమర్చనున్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభానికి ప్రభుత్వం తేదీ నిర్ణయిస్తుందని ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారావు తెలిపారు.