కేజీహెచ్‌లో క్రిటికల్ కేర్ బ్లాక్
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:10 AM
కేజీహెచ్‌లో మరో అత్యాధునిక వైద్య సేవల కేంద్రం ప్రారంభం కాబోతోంది. ఆస్పత్రి ఆవరణలోని మార్చురీ ఎదురుగా రూ.23.75 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ బ్లాక్‌ను నిర్మించింది. అందులో అవసరమైన పరికరాల కొనుగోలుకు మరో రూ.7.12 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది అక్టోబరు చివరి నాటికి ఈ బ్లాక్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. ఆస్పత్రిలో ఉన్న ఐసీయూ విభాగాలన్నింటినీ అందులోకి తరలించనున్నారు. అలాగే, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరిన రోగులకు అక్కడే వైద్యం అందిస్తారు.
మార్చురీ ఎదురుగా నిర్మాణం
రూ.23.75 కోట్లు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
రూ.7.12 కోట్లతో అత్యాధునిక పరిరకాలు కొనుగోలు
అక్టోబరు నెలాఖరు నాటికి
అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యత్నం
విశాఖపట్నం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి):
కేజీహెచ్‌లో మరో అత్యాధునిక వైద్య సేవల కేంద్రం ప్రారంభం కాబోతోంది. ఆస్పత్రి ఆవరణలోని మార్చురీ ఎదురుగా రూ.23.75 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ కేర్ బ్లాక్‌ను నిర్మించింది. అందులో అవసరమైన పరికరాల కొనుగోలుకు మరో రూ.7.12 కోట్లు వెచ్చిస్తోంది. ఇప్పటికే భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది అక్టోబరు చివరి నాటికి ఈ బ్లాక్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆరోగ్య శాఖ అధికారులు నిర్ణయించారు. ఆస్పత్రిలో ఉన్న ఐసీయూ విభాగాలన్నింటినీ అందులోకి తరలించనున్నారు. అలాగే, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరిన రోగులకు అక్కడే వైద్యం అందిస్తారు.
దేశంలోని అనేక రాష్ట్రాలకు కేంద్రం క్రిటికల్ కేర్ సెంటర్లను మంజూరుచేసింది. అందులో ఒకటి కేజీహెచ్‌లో ఏర్పాటైంది. ఆ బ్లాక్‌లో క్రిటికల్ కేర్ వైద్య సేవలకు సంబంధించి ప్రత్యేకంగా 50 పడకలతో వార్డు ఏర్పాటుచేస్తారు. అలాగే, మూడు అంతస్థులను ఐసీయూ విభాగాలకు కేటాయించనున్నారు. ఈ బ్లాక్‌లో వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా వైద్య సిబ్బందిని, నిపుణులను నియమించనున్నారు.
ఈ సమస్యలకు చికిత్స
గుండెపోటు, శ్వాసకోశ వైఫల్యం, తీవ్రమైన గాయాలైన వారికి ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు. 24 గంటలూ నిపుణులైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు.
అత్యాధునిక పరికరాలు
ఈ సెంటర్‌లో వైద్య సేవలు అందించేందుకు అనుగుణంగా రూ.7.12 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలను ఆరోగ్య శాఖ అధికారులు కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే కేంద్రం నిధులు ఇవ్వగా, కొనుగోలు ప్రక్రియ దాదాపు తుది దశకు వచ్చినట్టు చెబుతున్నారు. కొనుగోలు చేయనున్న పరికరాల జాబితాలో వెంటిలేటర్లు, మానిటర్లు, ఇతర ఐసీయూ పరికరాలు, అత్యాధునిక పరీక్ష మెషిన్లు ఉంటాయి.
మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయుక్తం
- డాక్టర్ ఐ.వాణి, కేజీహెచ్ సూపరింటెండెంట్
క్రిటికల్ కేర్ సెంటర్ అందుబాటులోకి వస్తే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవకాశం ఉంటుంది. పెయిన్ క్లినిక్‌ను కూడా అందులో నిర్వహించాలన్న ఆలోచన ఉంది. కొన్నిరకాల నొప్పులతో బాధపడే వారికి ఈ పెయిన్ క్లినిక్ ఉపయోగపడుతుంది. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో పరికరాలు కొనుగోలు చేసి ఇక్కడకు పంపిస్తారు.