కబ్జాదారులపై క్రిమినల్ కేసులు
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:09 AM
జీవీఎంసీ పరిధిలోని పార్కులు, ఓపెన్‌స్పేస్‌లను ఆక్రమించినా, కబ్జాకు యత్నించినా క్రిమినల్ కేసులు పెడతామని కమిషనర్ కేతన్‌గార్గ్ హెచ్చరించారు. ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో 1,480 పార్కులు, ఓపెన్‌స్పేస్‌లు ఉన్నాయన్నారు. వీటిలో 385 ఓపెన్ స్పేస్‌లను పార్కులుగా అభివృద్ధి చేయడం జరిగిందని, మిగిలిన వాటిని పరిరక్షించేందుకు ‘ఫెన్సింగ్’ వేయడంతోపాటు వాటి డాక్యుమెంట్‌లను పక్కాగా తయారుచేసుకోవాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించామన్నారు.
పార్కులు, ఓపెన్‌స్పేస్‌ల పరిరక్షణగా పక్కాగా చర్యలు
భవన నిర్మాణాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వం
భూముల సర్వేకు త్వరలో ఆన్‌లైన్ విధానం
ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్లతో
112 రహదారుల అభివృద్ధి
16 ప్రధాన కూడళ్లు ఆధునికీకరణ
ప్రధాన రహదారుల్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్
ట్రాఫిక్‌తో పాటు కాలుష్య సమస్యకు కొంతవరకు పరిష్కారం
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలోని పార్కులు, ఓపెన్‌స్పేస్‌లను ఆక్రమించినా, కబ్జాకు యత్నించినా క్రిమినల్ కేసులు పెడతామని కమిషనర్ కేతన్‌గార్గ్ హెచ్చరించారు. ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీవీఎంసీ పరిధిలో 1,480 పార్కులు, ఓపెన్‌స్పేస్‌లు ఉన్నాయన్నారు. వీటిలో 385 ఓపెన్ స్పేస్‌లను పార్కులుగా అభివృద్ధి చేయడం జరిగిందని, మిగిలిన వాటిని పరిరక్షించేందుకు ‘ఫెన్సింగ్’ వేయడంతోపాటు వాటి డాక్యుమెంట్‌లను పక్కాగా తయారుచేసుకోవాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించామన్నారు. కాగా, ‘ఆపరేషన్ లంగ్స్’ పేరుతో స్పెషల్‌డ్రైవ్ ప్రారంభించి 17 పార్కుల్లో ఆక్రమణలను తొలగించామన్నారు. పార్కుల నిర్వహణను రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లకు అప్పగిస్తామన్నారు.
అనధికార భవన నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు అనుమతి లేకుండా అదనపు అంతస్థులు నిర్మించినా, సెట్‌బ్యాక్‌ల ఉల్లంఘన జరిగినా...ఆయా భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీచేయకుండా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ చెప్పారు. భవన నిర్మాణాలు నిబంధనలకు లోబడి జరిగేలా కమాండ్ కంట్రోల్‌రూమ్ ద్వారా పర్యవేక్షించేలా వ్యవస్థను తయారుచేశామన్నారు. నగరంలో ప్రభుత్వ భూములు, గెడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేయకుండా సర్వే వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేశామన్నారు. త్వరలోనే ఆన్‌లైన్ సర్వే సౌలభ్యాన్ని అమలు చేయబోతున్నామన్నారు. దీనిప్రకారం సర్వే సర్టిఫికెట్ కావాలనుకునేవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే వార్డు ప్లానింగ్ సెక్రటరీలు, సర్వేయర్లు సమన్వయం చేసుకుని నిర్ణీత వ్యవధిలోగా నివేదికను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారన్నారు. దీనివల్ల సర్వేయర్లు చేతివాటానికి, అవినీతికి అడ్డుకట్టపడడంతోపాటు ప్రభుత్వ భూములు పరిరక్షణ, గెడ్డల ఆక్రమణకు అడ్డుకట్టపడుతుందన్నారు.
నగరంలో రోడ్ల విస్తరణకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఈ ఏడాదికాలంలో అభివృద్ధి చేసేందుకు 112 రహదారులను (ప్రతి వార్డులో కనీసం ఒక రోడ్డునైనా) ఎంపిక చేశామన్నారు. అలాగే నగరంలో 16 ప్రధాన కూడళ్లను ఆధునికీకరించాలని నిర్ణయించామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నగరంలో సీసీ, బీటీ రోడ్ల కోసం రూ.250 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. టీడీఆర్ బాండ్ల జారీని పారదర్శకంగానే చేస్తున్నామని, ప్రస్తుతం 450కిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నగరంలో గెడ్డలు, వరదనీటి కాలువల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. నగరంలో 23 డ్రైన్‌ల ద్వారా మురుగునీరు సముద్రంలో కలుస్తున్నదని, వాటిని కొత్తగా నిర్మించబోయే నాలుగు పంప్‌హౌస్‌ల ద్వారా అప్పుఘర్, సాగర్‌నగర్, భీమిలిల్లో కొత్తగా నిర్మించే ఎస్‌టీపీలకు మళ్లిస్తామన్నారు.
నగరంలో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు పోలీస్ కమిషనర్ శంఖబ్రతబాగ్చితో కలిసి కార్యాచరణ అమలుచేస్తున్నామన్నారు. 115 ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను స్మార్ట్ సిగ్నల్స్‌గా అభివృద్ధి చేయడంతోపాటు జాతీయ రహదారితోపాటు ఇతర ప్రధాన మార్గాల్లోని 56 ట్రాఫిక్ సిగ్నల్స్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సిగ్నల్ సింక్రనైజేషన్ చేయబోతున్నామన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద రెండు సంస్థలకు రెండేసి సిగ్నల్ పాయింట్లను కేటాయించామని, అక్కడి ఫలితాల ఆధారంగా మిగిలిన జంక్షన్లలో కూడా అదే తరహా సదుపాయం ఏర్పాటుచేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఈనెలలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్‌ఎఫ్‌పీ) పిలుస్తామన్నారు. ఒకచోట గ్రీన్‌సిగ్నల్ లభిస్తే తర్వాత సిగ్నల్ వద్దకు వెళ్లేసరికి అక్కడ కూడా గ్రీన్ సిగ్నల్ ఉంటుందన్నారు. దీనివల్ల వాహనదారులు ప్రతి జంక్షన్‌లో ఆగాల్సిన అవసరం ఉండదు కాబట్టి ట్రాఫిక్ సమస్య తగ్గడంతోపాటు వాహనాల నుంచి వెలువడే కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. ‘బ్లూమ్‌బర్గ్ మేయర్స్ ఛాలెంజ్-2025’కు ప్రపంచవ్యాప్తంగా 50 నగరాలు ఎంపికైతే అందులో జీవీఎంసీకి చోటు దక్కడం నగరవాసులకు గర్వకారణమన్నారు. పట్టణ ప్రాంతంలో సమస్యల పరిష్కారాన్ని ప్రజలే గుర్తించడం కోసం జీవీఎంసీ ‘వైజాగ్-ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్ (వి-పీయూఎల్‌ఎల్) మోడల్‌ను పైలట్ ప్రాజెక్టుగా 19వ వార్డు పరిధిలోని గణేష్‌నగర్‌లోనూ, 44వ వార్డు పరిధిని ఎంపిక చేసి కార్యక్రమాలు అమలుచేస్తుండడంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలతోపాటు జీవీఎంసీ అందించే సేవలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యులను చేయడంతోపాటు వారే సమస్యలకు పరిష్కారం సూచించేలా కృషిచేస్తున్నామన్నారు.