Share News

తగ్గిన నేరాలు

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:04 AM

నగరంలో గత ఏడాది (2024)తో పోల్చితే అన్ని రకాల నేరాలు తగ్గినప్పటికీ హత్యలు, ఆత్మహత్యకు పాల్పడేలా వేధింపులకు గురిచేసిన ఘటనలు మాత్రం పెరిగాయి.

తగ్గిన నేరాలు

2024లో 9,278 కేసులు నమోదు, ఈ ఏడాది 8,185...

రోడ్డు ప్రమాదాలు, మహిళలపై వేధింపులు, ఆర్థిక మోసాలు తగ్గుదల

హత్యలు మాత్రం పెరుగుదల

మహిళల భద్రతకు తీసుకున్న చర్యల కారణంగా దేశంలోనే సురక్షిత నగరంగా గుర్తింపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో గత ఏడాది (2024)తో పోల్చితే అన్ని రకాల నేరాలు తగ్గినప్పటికీ హత్యలు, ఆత్మహత్యకు పాల్పడేలా వేధింపులకు గురిచేసిన ఘటనలు మాత్రం పెరిగాయి. అయితే మొత్తమ్మీద చూస్తే మాత్రం క్రైమ్‌ రేటు గత ఏడాది కంటే 11.78 శాతం మేర తగ్గింది.

రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందిన విశాఖలో నేరాల సంఖ్య కూడా అంతేసంఖ్యలో నమోదవుతుంటుంది. కానీ ఈ ఏడాది హత్యలు, సొత్తు కోసం హత్యలు, ఆత్మహత్యకు పాల్పడేలా వేధించడం/ప్రేరేపించడం, చోరీ కేసులు మినహా మిగిలిన అన్నిరకాల కేసులు గణనీయంగా తగ్గాయి. గత ఏడాది నగరంలో 24 మంది హత్యకు గురైతే, ఈ ఏడాది ఇప్పటివరకూ 35 మంది హత్యకు గురయ్యారు. సొత్తు కోసం హత్యలు గత ఏడాది ఒక్కటి మాత్రమే జరిగితే ఈ ఏడాది మూడు నమోదయ్యాయి. ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించడం/వేధించడం వంటి కేసులు గత ఏడాది ఆరు నమోదైతే...ఈ ఏడాది 12కి పెరిగాయి. మిగిలిన అన్నిరకాల కేసులు తగ్గుముఖం పట్టాయి. కిడ్నాప్‌ కేసులు గత ఏడాది 27 నమోదైతే, ఈ ఏడాది 17కి తగ్గాయి. హత్యాయత్నం కేసులు గత ఏడాది 159 నమోదు కాగా, ఈ ఏడాది 135కి తగ్గాయి. అత్యాచారం కేసులు గత ఏడాది 126 నమోదైతే..ఈ ఏడాది 63కి తగ్గాయి. మహిళలపై వేధింపులు కేసులు గత ఏడాది 643 నమోదైతే..ఈ ఏడాది 499కి తగ్గాయి. ఇతర నేరాలు గత ఏడాది 1,062 నమోదైతే...ఈ ఏడాది 752కి తగ్గాయి. సొత్తు చోరీ కేసులు గత ఏడాది 1,148 నమోదైతే ఈ ఏడాది ఇప్పటివరకూ 1,159 నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాలు గత ఏడాది 1,132 జరిగితే, ఈ ఏడాది 1,086కి తగ్గాయి. రోడ్డు ప్రమాదాల్లో గత ఏడాది 347 మంది మరణిస్తే..ఈ ఏడాది 349 మంది మరణించారు.

రాత్రిపూట ఇళ్లలో చోరీలు గత ఏడాది 250 జరిగితే ఈ ఏడాది 147కి తగ్గాయి. పగటిపూట చోరీ కేసులు గత ఏడాది 65 జరిగితే ఈ ఏడాది 36కి తగ్గాయి. చైన్‌స్నాచింగ్‌ కేసులు గత ఏడాది 78 నమోదైతే...ఈ ఏడాది 68కి తగ్గాయి. ద్విచక్ర వాహనాల చోరీలు గత ఏడాది 335 జరిగితే, ఈ ఏడాది 296కి తగ్గాయి. సెల్‌ఫోన్‌ చోరీలు/మిస్సింగ్‌ కేసుల్లో గత ఏడాది 1,728 రికవరీ జరిగితే, ఈ ఏడాది 3,477 సెల్‌ఫోన్‌లను రికవరీ చేశారు. గత ఏడాది చోరీ కేసుల్లో రూ.9.38 కోట్లు విలువైన సొత్తు అపహరణకు గురైతే అందులో రూ.4.96 కోట్లు మాత్రమే రికవరీ చేయగా, ఈ ఏడాది రూ.7.82 కోట్లు సొత్తు అపహరణకు గురికాగా అందులో రూ.4.9 కోట్లు విలువైన సొత్తును రికవరీ చేయగలిగారు. ఆర్థిక నేరాలు, మోసాలకు సంబంధించి గత ఏడాది 747 కేసులు నమోదైతే, ఈ ఏడాది 653కి తగ్గాయి. గంజాయి రవాణా, వినియోగం, విక్రయానికి సంబంధించి గత ఏడాది 313 ఎన్‌డీపీఎస్‌ కేసులు నమోదైతే ఈ ఏడాది 226కి తగ్గాయి. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టడం, నేరాలకు పాల్పడేవారిని టెక్నాలజీ ఉపయోగించి గుర్తించి అరెస్టు చేయడంతో సైబర్‌ నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత ఏడాది 374 కేసులు నమోదైతే...ఈ ఏడాది 286కి తగ్గింది. సైబర్‌ నేరాలకు పాల్పడే వారిని గత ఏడాది 160 మందిని అరెస్టు చేస్తే...ఈ ఏడాది 205 మందిని అరెస్టు చేశారు. మహిళలపై దాడులు, అఘాయిత్యాలు, వేధింపులు జరగకుండా కళాశాలలు, బస్టాప్‌లు, పర్యాటక ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో శక్తిటీమ్‌లను ఏర్పాటుచేయడం, డ్రోన్‌లతో గస్తీ చేపట్టడం, కాలేజీలు, కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి కారణాల వల్ల వేధింపులు, అత్యాచారాలు గణనీయంగా తగ్గడంతో దేశంలోనే విశాఖ మహిళలకు సురక్షిత నగరంగా గుర్తింపు పొందింది. మొత్తం నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గత ఏడాది 9,278 కేసులు నమోదైతే..ఈ ఏడాది 8,185 కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చితే క్రైమ్‌ రేటు 11.78 శాతం తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా క్రైమ్‌ రేటు 6.17 శాతం తగ్గగా, నగరంలో అంతకు దాదాపు రెట్టింపు తగ్గింది.

వచ్చే ఏడాది నాటికి మరింతగా నేరాలు తగ్గుతాయి

సీపీ శంఖబ్రతబాగ్చి

నగరంలో నేరాలు, రోడ్డు ప్రమాదాలను తగ్గించడంతోపాటు మహిళలకు భద్రత పెరిగేందుకు నేను అమలుచేసిన ప్రణాళికలు, వ్యూహాలు ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇవ్వడం మొదలైంది. వచ్చే ఏడాది నాటికి నగరంలో క్రైమ్‌రేటుతోపాటు రోడ్డు ప్రమాదాలు, సైబర్‌ నేరాల సంఖ్య మరింత తగ్గుతాయి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా నా వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ ఇచ్చాను. అలాగే సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే సమర్థంగా విధులు నిర్వర్తిస్తారని గుర్తించి వారి సంక్షేమం, ఆరోగ్యానికి అనేక చర్యలు తీసుకున్నాను. యువత చెడు మార్గంలోకి వెళ్లకుండా విద్యార్థి దశ నుంచే చైతన్యం కల్పించేందుకు నవసమాజనిర్మాణం పేరుతో కార్యక్రమాలు ప్రారంభించాం. జీవీఎంసీ సహకారంతో నగరంలో ఏఐ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ అమల్లోకి తీసుకువస్తే ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

----------------------------------------------

నేరం 2024 2025 (డిసెంబరు 22 నాటికి)

హత్యలు 24 35

సొత్తు కోసం హత్యలు 1 3

ఆత్మహత్యకు ప్రేరేపించడం 6 12

కిడ్నాప్‌లు 27 17

హత్యాయత్నాలు 159 135

అగౌరవపరచడం 473 439

ఆర్థిక మోసాలు 747 653

అత్యాచారం 126 63

కట్నం వేధింపులతో

మరణాలు 4 2

మహిళలపై వేధింపులు643 499

సొత్తు చోరీలు 1,148 1,159

రోడ్డు ప్రమాదాలు 1,132 1,086

----------------------------------------------

Updated Date - Dec 31 , 2025 | 12:04 AM