Share News

నేరాలు తగ్గుముఖం

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:47 AM

జిల్లాలో గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయి. అలాగే సమాజానికి పెను సవాల్‌గా మారిన గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు.

నేరాలు తగ్గుముఖం
జి.మాడుగుల మండలంలోని మారుమూల ప్రాంతంలో డ్రోన్‌తో గంజాయిపై నిఘా పెడుతున్న పోలీసు బృందం(ఫైల్‌)

గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది 34 శాతం తగ్గిన కేసులు

గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం

మావోయిస్టుల కట్టడిలో పోలీసు యంత్రాంగం సఫలీకృతం

ఇతర కేసుల్లోనూ ఆశించిన పురోగతి

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయి. అలాగే సమాజానికి పెను సవాల్‌గా మారిన గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇతర కేసుల్లోనూ ఆశించిన పురోగతిని సాధించారు. దీంతో అన్ని రకాల నేరాలకు సంబంధించి 2023లో మొత్తం 1,958 కేసులు, 2024లో 2,304 కేసులు నమోదుకాగా, 2025లో మాత్రం 1,498 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

జిల్లాలో ప్రధాన సమస్యగా మారిన గంజాయి, మాదక ద్రవ్యాలను నియంత్రించడంలో ఈ ఏడాది పోలీసులు సత్ఫలితాలను సాధించారు. ఈ ఏడాది గంజాయికి సంబంధించి 135 కేసులు సమోదుకాగా, 14,484 కిలోల ఎండు గంజాయి, 35 కిలోల లిక్విడ్‌ గంజాయిని స్వాధీనం చేసుకుని, 358 మంది నిందితులను అరెస్టు చేశారు. ఎక్కడా గంజాయి సాగుకు అవకాశం లేకుండా నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఒడిశా రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న 138 మారుమూల గిరిజన ప్రాంతాల్లో డ్రోన్లు, గూఢచారులతో పర్యవేక్షించారు. గంజాయి ద్వారా అక్రమంగా సంపాదించినట్టు గుర్తించిన రూ.4 కోట్ల 41 లక్షల విలువైన ఆస్తులను స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి సాగును విడిచిపెట్టిన 325 గిరిజన కటుంబాలకు ప్రత్యాయ్నాయ జీవనోపాధి కల్పించారు. గంజాయి సాగుకు దూరమైన ప్రాంతాల్లో గిరిజన రైతులకు 29 వేల ఎకరాల్లో పలు రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు 1,596 గ్రామాల్లో, 253 విద్యాలయాల్లో పలు రకాల అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.

మావోయిస్టుల కట్టడిలో ముందంజ

జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలను కట్టడి చేయడంలో పోలీసులు ఈ ఏడాది ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. మావోయిస్టులకు సంబంఽధించి 16 కేసులు నమోదుకాగా, 9 మందిని అరెస్టు చేశారు. 49 మంది లొంగిపోయారు. అలాగే మావోయిస్టులు, పోలీసుల మధ్య ఈ ఏడాది జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఏడాది జూన్‌ 18న మారేడుమిల్లి స్టేషన్‌ పరిధిలో జరిగిన కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు రాజర్ల రవి, ఏవోబీ సభ్యురాలు ఆరుణ మృతి చెందగా, నవంబరు 18న జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలైన కేంద్ర కమిటీ సభ్యుడు మడ్వి హిడ్మా, అతని భార్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు మడకం రాజేతో పాటు మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా, అదే నెల 19న జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ఆంధ్ర- ఒడిశా సరిహద్దు మెట్టూరి జోగారావు అలియాస్‌ టెక్‌ శంకర్‌తో పాటు నంబాల కేశవరావు అంగరక్షకురాలిగా పని చేసిన జ్యోతి, మరో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది మావోయిస్టులను కట్టడి చేయడంలో పోలీసులు విజయం సాధించారు. కాగా మహిళలపై నేరాలు, సైబర్‌ క్రైమ్‌లు, రోడ్డు ప్రమాదాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 14 శాతం తగ్గాయని ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ తెలిపారు. ఈ ఏడాది పలు కేసుల్లో శిక్షలు కూడా పడ్డాయి. ఐదు కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడగా, ఒక కేసులో 20 సంవత్సరాల జైలుశిక్ష, రెండు కేసుల్లో 10 సంవత్సరాల జైలుశిక్ష, ఒక కేసులో 7 సంవత్సరాల జైలుశిక్ష పడ్డాయి. లోక్‌ అదాలత్‌లో అధిక సంఖ్యలో 843 కేసులు పరిష్కారమయ్యాయి.

సమన్వయంతో చక్కని ఫలితాలు సాధించాం

అందరి సమన్వయంతో ఈ ఏడాది జిల్లాలో నేరాల నియంత్రణలో చక్కని ఫలితాలు సాధించామని ఎస్‌పీ అమిత్‌బర్ధార్‌ తెలిపారు. జిల్లాలో వార్షిక నేర సమీక్షలో భాగంగా సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది 34 శాతం కేసులు తగ్గాయన్నారు. గంజాయిని అరికట్టడంలో, మావోయిస్టులను కట్టడి చేయడంలో సఫలీకృతమయ్యామన్నారు. జిల్లాలో గంజాయి వాసన లేకుండా చేశామని, సాగు, రవాణాపై నిఘా పెట్టి నియంత్రించామన్నారు. మావోయిస్టు కార్యకలాపాలనైనా గట్టి నిఘా పెట్టి, నియంత్రణ చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. ఫలితంగా ఈ ఏడాది 18 మంది మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందారని, 49 మంది లొంగిపోవడంతోపాటు 9 మందిని అరెస్టు చేశామన్నారు. ఇతర నేరాలను సైతం నియంత్రించామని చెప్పారు. వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన 151 సెల్‌ఫోన్లను రికవరీ చేసి, బాధితులకు అప్పగించామన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో నేర నియంత్రణకు కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలను అందించిన అభినందించారు.

Updated Date - Dec 30 , 2025 | 12:57 AM