Share News

క్రికెట్‌ సందడి

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:50 AM

నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల 6న దక్షిణాఫ్రికాతో జరగనున్న అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

క్రికెట్‌ సందడి

  • విరాట్‌, రోహిత్‌ బ్యాటింగ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానుల ఎదురుచూపు

  • 6న మ్యాచ్‌

  • హాట్‌కేకుల్లా అమ్ముడుపోయిన టికెట్లు

  • డిజిటల్‌ టికెటింగ్‌

  • నో సీటు నంబరు?

విశాఖపట్నం-స్పోర్స్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల 6న దక్షిణాఫ్రికాతో జరగనున్న అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ కోసం క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విరాట్‌ కొహ్లి, రోహిత్‌శర్మ బ్యాటింగ్‌ను ఎప్పుడు వీక్షిస్తామా అనే ఉత్సుకతతో ఉన్నారు. రాంచీలో జరిగిన తొలి వన్డేలో సెంచరీతో కొహ్లి, అర్ధ సెంచరీతో రోహిత్‌శర్మ వీరవిహారం చేయడంతో ఇక్కడ జరగనున్న మ్యాచ్‌కు మరింత క్రేజ్‌ వచ్చింది. అందుకే ఇప్పటివరకూ విశాఖలో జరిగిన పది వన్డే మ్యాచ్‌లతో పోల్చితే ఈసారి టికెట్‌ ధరలు భారీగా పెంచినా క్రీడాభిమానులు వెనకాడకపోవడం గమనించదగ్గ విషయం.

22 వేల టికెట్లు హాంఫట్‌

ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సామర్థ్యం సుమారు 27 వేలు కాగా, నిర్వాహకులు 22 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచారు. గంటల వ్యవధిలోనే టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అయిపోయాయి. గతంలో ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్ల విక్రయాలు జరిగేవి. ఆన్‌లైన్‌లో టికెట్‌ తీసుకోవడం రానివారు, దొరకనివారు...ఆఫ్‌లైన్‌లో ఏర్పాటుచేసే విక్రయ కేంద్రాల వద్ద అర్ధరాత్రి నుంచి కాపుకాసి టికెట్‌ పొందిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుత ఏసీఏ కార్యవర్గం అటువంటి చర్యలు చేపట్టకపోవడంపై క్రీడాభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

డిజిటల్‌ టికెటింగ్‌...నో సీటు నంబరు

ఈ మ్యాచ్‌కు డిజిటల్‌ టికెటింగ్‌ను ప్రవేశపెడుతున్నారు. ప్రవేశ ద్వారాల వద్ద టికెట్‌ స్కాన్‌ చేసి లోపలకు ప్రవేశించాల్సిందే. ఒకరు లోపలకు వెళ్లి, దొడ్డిదారిలో ఆ టికెట్‌ను బయట ఉన్న మరొకరికి అందించినా ఫలితం ఉండదు. ఒకసారి స్కాన్‌ అయిన టికెట్‌కు రెండోసారి అవకాశం ఉండదు. అంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మ్యాచ్‌కు సీటు నంబరింగ్‌ విధానం అమలు చేయడం లేదని తెలుస్తోంది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ మాదిరిగా ముందు వచ్చినవారు తమకు ఇష్టమైన సీట్లలో కూర్చోవచ్చు. అయితే ఈ విధానంతో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని క్రికెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముందుగా వచ్చి ముందు సీటులో కూర్చొన్న వ్యక్తి వాష్‌రూమ్‌ లేదా వేరే అవసరాలతో అక్కడ నుంచి వెళితే...మరొకరు కూర్చొనే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదాలు ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఇదే విషయాన్ని కొందరు ఏసీఏ ప్రతినిధులు వద్ద ప్రస్తావించగా అటువంటిదేమీ ఉండదని తేలికగా తీసుకున్నారని సమాచారం.

Updated Date - Dec 03 , 2025 | 12:50 AM