క్రికెట్ సందడి
ABN , Publish Date - Dec 21 , 2025 | 01:28 AM
భారత్, శ్రీలంక మహిళల మధ్య ఆదివారం జరగనున్న టీ20 మ్యాచ్‌కు ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
నేడు భారత్, శ్రీలంక మహిళల టీ20 మ్యాచ్
తొలి మ్యాచ్‌కు సిద్ధమైన ఏసీఏ-వీడీసీఏ స్టేడియం
విశాఖపట్నం స్పోర్ట్స్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి):
భారత్, శ్రీలంక మహిళల మధ్య ఆదివారం జరగనున్న టీ20 మ్యాచ్‌కు ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. హర్మత్ ప్రీత్‌కౌర్ సారథ్యంలోని భారత్ జట్టు...చమరి ఆటపత్తు నాయకత్వంలోని శ్రీలంక సేనతో తలపడనున్నది. భారత్ జట్టు వరల్డ్ కప్‌ను గెలుచుకున్న తరువాత ఆడుతున్న తొలిమ్యాచ్ కావడంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొన్నది. భారత్ జట్టులో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధానా, రిచా ఘోష్, దీప్తి శర్మతోపాటు ఆంధ్ర క్రికెటర్ శ్రీచరణి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత తొలి మ్యాచ్
మ్యాచ్‌కు మూడు రోజుల ముందుగానే నగరానికి చేరకున్న భారత్ మహిళలు ఫిట్‌నెస్ సాధనపై దృష్టిసారించారు. శ్రీలంక మహిళా క్రికెటర్లు కూడా ముమ్మరంగా బ్యాటింగ్, బౌలింగ్ సాధన చేశారు.
పదకొండేళ్ల తర్వాత విశాఖలో భారత్, శ్రీలంక ఢీ
భారత్, శ్రీలంక మహిళలు దాదాపు 11 ఏళ్ల తర్వాత విశాఖలో టీ20 మ్యాచ్‌లో తలపడుతున్నారు. 2014 జనవరి 28న జరిగిన టీ20 మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓటమి చెందింది.