కాలుష్యంపై కొరడా
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:05 AM
నగరంలో కాలుష్యం పెంచే పరిశ్రమలపై కాలుష్య నియంత్రణమండలి అధికారులు కొరడా ఝుళిపించారు.
నియంత్రణ దిశగా కదిలిన యంత్రాంగం
మూడు కంపెనీలకు పీసీబీ నోటీసులు
మరికొన్ని కంపెనీలకు నేడో, రేపో జారీ
భారీగా పర్యావరణ పరిహారం వసూలుకు నిర్ణయం
కాలుష్యం వెదజల్లే వాహనాలకు రూ.7.45 లక్షల జరిమానా
మరోవైపు టాస్క్‌ఫోర్స్ తనిఖీలు
విశాఖపట్నం, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి):
నగరంలో కాలుష్యం పెంచే పరిశ్రమలపై కాలుష్య నియంత్రణమండలి అధికారులు కొరడా ఝుళిపించారు. గత కొద్దిరోజులుగా చేపట్టిన తనిఖీల మేరకు మూడు పెద్ద పరిశ్రమలకు నోటీసులు జారీ చేశారు. గాలి నాణ్యత సూచీలు పెరగడం ద్వారా ప్రజారోగ్యంపై ప్రభావం పడడానికి కారణమైన పరిశ్రమలు పర్యావరణ పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒక్కో కంపెనీ రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు. అయితే నోటీసులు జారీచేసిన కంపెనీల వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు.
నగరం, పరిసరాల్లో కాలుష్యం పెరగడంతో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఇది ఆన్‌లైన్ యాంబియంట్ ఎయిర్‌క్వాలిటీ యంత్రాల ద్వారా బహిర్గతమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ కంటే నగరంలో గాలి నాణ్యత క్షీణించిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 21వ తేదీ నుంచి 20 మంది అధికారులు ఆరు బృందాలుగా ఏర్పడి శుక్రవారం వరకు పలు పరిశ్రమలు, సంస్థలను తనిఖీ చేశారు. దీనికి అనుగుణంగా శుక్రవారం మూడు కంపెనీలకు నోటీసులు జారీచేసిన పీసీబీ, ఒకటి, రెండు రోజుల్లో మరిన్ని కంపెనీలకు నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తరువాత పర్యావరణ పరిహారం వసూలు చేయాలని యోచిస్తున్నారు.
ప్రభుత్వ ప్రత్యేక దృష్టి
నగరంలో గాలి నాణ్యత క్షీణించడంపై ఇటీవల ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో పలు శాఖలతో కలెక్టర్ ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటుచేశారు. పీసీబీతోపాటు రవాణా, ఆర్టీసీ, ఏపీఐఐసీ, జీవీఎంసీ, పౌర సరఫరాల శాఖాధికారులు కలిసి పరిశ్రమలను తనిఖీ చేశారు. విశాఖ పోర్టు, గంగవరం పోర్టు, హెచ్‌పీసీఎల్, ఉక్కు కర్మాగారం, జింక్ గేట్ ప్రాంతాలతోపాటు నగరంలో పలుచోట్ల వాహనాలను తనిఖీ చేశారు. కాలుష్య కారక వాహనాలు, అధికలోడు, టార్పాలిన్లు లేకుండా రవాణా చేస్తున్న వాహనాలకు 78 ఈ చలాన్లు నమోదుచేసి రూ.7.45 లక్షల జరిమానా విధించారు. తనిఖీలో పది ఆర్టీసీ బస్సుల్లో లోపాలు గుర్తించారు. వాయు కాలుష్య ఉల్లంఘనలు గుర్తించడానికి జీవీఎంసీ 10 ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను ఏర్పాటుచేసింది. ఈ బృందాలు శుక్రవారం నగరంలో తనిఖీలు నిర్వహించి 51 ఉల్లంఘనలు గుర్తించి 39 కేసులు నమోదుచేశాయి. నగరంలో రోడ్డు పక్కన చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు తవ్విన ప్రాంతాల్లో మట్టి నుంచి ధూళి రాకుండా నీటితో తడిపే ప్రక్రియ చేపట్టారు. పోర్టు పరిసర రోడ్ల నుంచి ధూళి రేగకుండా నీటిని స్ర్పే చేశారు. వాహనాలు వినియోగించే డీజల్, పెట్రోల్‌లో స్వచ్ఛత నిర్ధారణను జిల్లా పౌరసరఫరాల అధికారి వి.భాస్కర్ చేపట్టారు. కాలుష్యం వెదజల్లి తద్వారా గాలి నాణ్యత క్షీణించడానికి కారణమైన పరిశ్రమలు, సంస్థల్లో నిరంతర తనిఖీలు జరుగుతాయని కాలుష్య నియంత్రణమండలి ఈఈ పీవీ ముకుందరావు తెలిపారు. రోజువారీ నివేదికలను కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు.