Share News

గంజాయి స్మగ్లర్ల బరితెగింపు

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:54 AM

గంజాయి స్మగ్లర్లు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కారును వేగంగా నడిపి, వాహనాలపైకి దూసుకెళ్లారు. ఈ ఘటనలో భార్యాభర్తలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్మగ్లర్ల కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. ఇందులో వున్న ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గంజాయి స్మగ్లర్ల బరితెగింపు
విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఆగిన కారు

పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వేగంగా కారు డ్రైవింగ్‌

ఆటో, బైక్‌పైకి దూసుకెళ్లడంతో ఇద్దరికి గాయాలు

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఆగిన కారు

ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

240 కిలోల గంజాయి స్వాధీనం

చోడవరం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): గంజాయి స్మగ్లర్లు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో కారును వేగంగా నడిపి, వాహనాలపైకి దూసుకెళ్లారు. ఈ ఘటనలో భార్యాభర్తలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. స్మగ్లర్ల కారు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. ఇందులో వున్న ఇద్దరు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో వున్న 240 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

ఏజెన్సీ ప్రాంతం నుంచి కారులో మైదాన ప్రాంతానికి గంజాయి రవాణా అవుతున్నట్టు శుక్రవారం సాయంత్రం చోడవరం పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్టేషన్‌ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో వడ్డాది వైపు నుంచి వస్తున్న కారును డ్రైవర్‌ ఆపకుండా ముందుకు పోనిచ్చారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై కారును వెంబడించారు. దీంతో కారు డ్రైవర్‌ వేగాన్ని మరింత పెంచాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అటవీ శాఖ కార్యాలయం వద్ద రోడ్డుపై వెళుతున్న ఆటోను, మోటారు బైక్‌ను ఢీకొట్టాడు. అనంతరం రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొని కారు ఆగిపోయింది. బైక్‌పై వెళుతున్న దుడ్డుపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు కూర్మదాసు గోవింద, చిన్నమ్మలు తలకు గాయాలయ్యాయి. విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన అనంతరం కారు ఆగిపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. కారులో సోదా చేయగా 240 కిలోల గంజాయి లభ్యమైంది. రాజస్థాన్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అదపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. సీఐ బి.అప్పలరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 22 , 2025 | 12:54 AM