Share News

సీపీఐ నేత మాకిరెడ్డి బలవన్మరణం

ABN , Publish Date - Nov 13 , 2025 | 01:06 AM

సీపీఐ జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు(53) గడ్డి మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. బుధవారం ఆయన భార్య సత్యవేణి పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని బ్యాంక్‌ కాలనీలో భార్య, పిల్లలతో రామునాయుడు నివాసం ఉంటున్నారు. మూడు నెలల క్రితం కుమారుడు ప్రదీప్‌ మృతి చెందాడు.

సీపీఐ నేత మాకిరెడ్డి బలవన్మరణం
మాకిరెడ్డి రామునాయుడు (ఫైల్‌ ఫొటో)

నర్సీపట్నం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సీపీఐ జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు(53) గడ్డి మందుతాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. బుధవారం ఆయన భార్య సత్యవేణి పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని బ్యాంక్‌ కాలనీలో భార్య, పిల్లలతో రామునాయుడు నివాసం ఉంటున్నారు. మూడు నెలల క్రితం కుమారుడు ప్రదీప్‌ మృతి చెందాడు. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోలేక రామునాయుడు మనోవేదనతో ఉండేవారు. ఈ నేపథ్యంలో బుధవారం ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడారు. ఆ సమయంలో కుమార్తె రోషిత ఇంట్లో ఉంది. తండ్రి పరిస్థితి గమనించి హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ రామునాయుడు కన్నుమూశారు. ఆయన స్వగ్రామం గొలుగొండ మండలం చోద్యం. మొదటి భార్య చనిపోయిన తరువాత సత్యవేణిని రెండో వివాహం చేసుకున్నారు. ఆమె ప్రస్తుతం కొయ్యూరు మండలంలో టీచర్‌గా పని చేస్తున్నారు. సీపీఐలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కౌన్సిలర్‌ సభ్యుడు స్థాయికి రామునాయుడు ఎదిగారు. పార్టీ ఆధ్వర్యంలో జరిగే ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాల్లో ఆయన చురుకైన పాత్ర పోషించేవారు. గతంలో ప్రజానాట్య మండలిలో పని చేశారు. గొలుగొండ మండల పార్టీ అధ్యక్షులుగా రెండు పర్యాయాలు పని చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిగా ఉన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకొని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలేపల్లి వెంకటరమణ, సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు డీసీహెచ్‌ క్రాంతి, సీపీఐ నాయకులు గురుబాబు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు శివలంక గొండలరావు ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంత్యక్రియలు చోద్యంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Nov 13 , 2025 | 01:06 AM