కోడివ్యర్థాల సేకరణ వివాదంపై సీపీ సీరియస్
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:49 AM
నగరంలో వివాదాలకు చిరునామాగా మారిన కోడివ్యర్థాల సేకరణ పంచాయితీపై సీపీ శంఖబ్రతబాగ్చి సీరియస్ అయినట్టు తెలిసింది.
కాంట్రాక్టర్లను బెదిరించిన వారిపై కఠిన చర్యలకు ఆదేశం
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
నగరంలో వివాదాలకు చిరునామాగా మారిన కోడివ్యర్థాల సేకరణ పంచాయితీపై సీపీ శంఖబ్రతబాగ్చి సీరియస్ అయినట్టు తెలిసింది. కోడివ్యర్థాల సేకరణ కాంట్రాక్టు దక్కించుకున్న వారిని బెదిరించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని గోపాలపట్నం పోలీసులను ఆదేశించినట్టు సమాచారం.
జీవీఎంసీ పరిధిలోని చికెన్ దుకాణాల నుంచి వ్యర్థాలను కాపులుప్పాడ డంపింగ్‌యార్డుకు తరలించే బాధ్యత ను జోన్లవారీగా కాంట్రాక్టర్లకు జీవీఎంసీ అప్పగించింది. వారు వ్యర్థాలను చేపలచెరువులకు విక్రయిస్తున్నారు. దీని వల్ల భారీగా ఆదాయం సమకూరుతుండడంతో గతంలో కోడివ్యర్థాల సేకరణలో అనుభవం ఉన్న ఓ వైసీపీ చోటా నేత కన్నేశారు. తనకు కోడివ్యర్థాల సేకరణలో వాటా ఇవ్వాలని బెదిరించడంతోపాటు వాహనాలను అడ్డుకుని అధికారులకు అప్పగిస్తున్నట్టు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై నగరానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి ద్వారా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో పోలీసులు వైసీపీ చోటానేతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ మేరకు ‘ఆంధ్రజ్యోతి’లో ‘చికెన్ వ్యర్థాల సేకరణ వివాదంపై టాస్క్‌ఫోర్స్ పంచాయితీ’ శీర్షికన శనివారం కథనం ప్రచురించింది. దీనిపై సీపీ శంఖబ్రతబాగ్చిఆరా తీసినట్టు తెలిసింది. స్పెషల్‌బ్రాంచి, ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో పేర్కొన్న అంశాలు వాస్తవమేనని నిర్ధారించడంతో లోతుగా విచారణ జరపాలని సీపీ గోపాలపట్నం పోలీసులను ఆదేశించినట్టు సమాచారం. ఈ మేరకు కోడివ్యర్థాల సేకరణ బాధ్యతలు చూస్తున్న కాంట్రాక్టర్లను సోమవారం ఆధారాలతో గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌కు రావాలని పోలీసులు సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ చోటానేత బెదిరింపులు, ఇతర వ్యవహారాలు వాస్తవమేనని తేలితే క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం.