యథేచ్ఛగా గోవధ!
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:43 AM
గోవధ, మాంసం ఎగుమతికి నగరం కేంద్రంగా మారింది.
మాంసం ఇతర ప్రాంతాలకు ఎగుమతి
ఇటీవల ఆనందపురం వద్ద గల ఒక కోల్డ్‌స్టోరేజీలో 189 టన్నుల మాంసం సీజ్ చేసిన డీఆర్‌ఐ
అందులో అత్యధికం గోమాంసమని పరీక్షల్లో వెల్లడి
రెండు రోజుల కిందట నగర పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి వివరాలు ఆరాతీసిన డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
ఇతర రాష్ట్రాలకు చెందినవారి హస్తం ఉన్నట్టు గుర్తింపు
నిందితుల కోసం గాలింపు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
గోవధ, మాంసం ఎగుమతికి నగరం కేంద్రంగా మారింది. ఒడిశాతోపాటు ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల నుంచి గోవులను ఇక్కడకు తీసుకువచ్చి వధిస్తున్నారు. మాంసాన్ని కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరిచి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవల డీఆర్‌ఐ అధికారులు ఆనందపురం శివారులోని ఒక కోల్డ్‌స్టోరీజీపై దాడి చేసి 189 టన్నుల మాంసాన్ని సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇటీవల సీపీ శంఖబ్రతబాగ్చికి ఫోన్ చేసి కేసు గురించి ఆరా తీయడంతో దర్యాప్తు వేగవంతం చేశారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని సంతల్లో ఆవులను కొనుగోలు చేసి కొందరు వ్యాపారులు నగరానికి తీసుకువస్తున్నారు. ఆనందపురం, మధురవాడ, ఆరిలోవ, వన్‌టౌన్ రెల్లివీధి, రైల్వేన్యూకాలనీ వంటి ప్రాంతాల్లో వధిస్తున్నారు. గోవులను వధించడం తీవ్ర నేరం. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడంతో వ్యవహారం బహిరంగంగానే జరిగిపోతోంది. దీనిపై గోసంరక్షణ సేవకులు, హిందూ సంఘాలు చాలాకాలంగా పోరాటం చేస్తున్నాయి. గోవులను తరలిస్తున్న వాహనాలను పట్టుకుని పోలీసులకు అప్పగిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదుచేసి గోవులను సమీపంలోని గోశాలలకు అప్పగిస్తున్నారు. అయితే గోమాంసం వ్యాపారులు తెలివిగా గోశాలల వద్దకు వెళ్లి నిర్వాహకులకు డబ్బులు ముట్టజెప్పి, ఆవులను రైతులకు పెంపకానికి ఇస్తున్నట్టు చూపించి పోలీసులు అప్పగించిన ఆవులను వధశాలకు తరలించుకుపోతున్నారు. నగరంలో ప్రతిరోజూ వందల సంఖ్యలో ఆవులను వధిస్తున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆవులను వధించిన తర్వాత మాంసాన్ని చిరు వ్యాపారులు స్థానికంగా విక్రయిస్తుంటే...పెద్ద వ్యాపారులు మాత్రం కోల్ట్‌స్టోరేజీల్లో భద్రపరిచి కంటెయినర్ల ద్వారా ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గోవధ, గోమాంసం విక్రయించడం రాష్ట్రంలో నిషేధం అయినప్పటికీ వ్యాపారులు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో డైరెక్టర్ ఆఫ్‌రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు స్పందించి ఆనందపురం మండలం శివారులోని ఒక గోడౌన్‌పై కొద్దిరోజుల కిందట దాడిచేశారు. ఆ సమయంలో సుమారు 189 టన్నుల మాంసం పట్టుబడింది. నమూనాలను తీసి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించగా పట్టుబడిన దాంట్లో అత్యధికం గోమాంసమేనని నిర్ధారిస్తూ నివేదిక పంపినట్టు తెలిసింది. దీనిపై రెండు రోజులు కిందట డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నేరుగా సీపీ శంఖబ్రతబాగ్చికి ఫోన్ చేసి ఆరాతీశారు. దీంతో గోమాంసం కేసు విషయం వెలుగులోకి వచ్చింది. గోవులను వధించడం, అక్రమంగా తరలించడం నేరం కాబట్టి, అలాంటిపనులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించినట్టు తెలిసింది. అలాగే అంతపెద్దమొత్తంలో గోమాంసం ఎక్కడి నుంచి వచ్చింది?, ఎక్కడ వధించారు?, ఎక్కడి నుంచి కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు?, వాటి రవాణా ఎలా జరుగుతోందనే వివరాలు ఆరా తీసినట్టు తెలిసింది. దీనికి సీపీ స్పందిస్తూ కేసు డీఆర్‌ఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ పోలీస్ శాఖాపరంగా కూడా వివరాలను ఆరా తీయడంతోపాటు మూలాలను గుర్తిస్తామని డిప్యూటీ సీఎంకు వివరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు దర్యాప్తు వేగం పెంచారు. గోమాంసం ఎగుమతిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారే కీలకంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే సిబ్బందిని పంపినట్టు పోలీస్ అధికారులు చెబుతున్నారు. ఏదిఏమైనా గోవధకు కేంద్రంగా మారిన విశాఖ నగరంలో గోవుల రవాణా, వధకు పూర్తిగా అడ్డుకట్ట వేయడంపై సీపీ దృష్టిసారించాలని గోసంరక్షణ కార్యకర్తలు, హిందూ ధర్మపరిరక్షణ సంఘాలు కోరుతున్నాయి.