గోవధ!
ABN , Publish Date - Nov 05 , 2025 | 01:09 AM
నగరంలో అనధికార కబేళాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.
నగరంలోని దుకాణాలతో పాటు ఇతర జిల్లాలకు మాంసం రవాణా
నగరంలో పుట్టగొడుగుల్లా వెలిసిన అనధికార కబేళాలు
పరిసరాల్లో తీవ్రదుర్వాసన
ప్రజలను చుట్టుముడుతున్న ఆరోగ్యసమస్యలు
జంతు క్రూరత్వ నిరోధక చట్టానికి తూట్లు
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలో అనధికార కబేళాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. మారికవలస కబేళాలో కూడా ఎద్దులు, దున్నపోతులను వధించేందుకు మాత్రమే అనుమతి ఉంది. కానీ కొందరు ఆరిలోవ, రైల్వేన్యూకాలనీ, వన్‌టౌన్, తదితర ప్రాంతాల్లో జనావాసాల మధ్య ఇళ్లలోనే గోవులను వధించి మాంసాన్ని దుకాణాలు, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దీనిపై ఎన్ని ఫిర్యాదులు అందినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మారికవలస వద్ద కబేళా ఏర్పాటుకు జీవీఎంసీ అనుమతి ఇచ్చింది. జంతు క్రూరత్వ నిరోధక చట్టం-1977 ప్రకారం అక్కడ ఎద్దులు, దున్నపోతులు, మేకలు, గొర్రెలు వంటి వాటిని అన్నిరకాల ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత ప్రభుత్వ పశువైద్యాధికారి, ప్రజారోగ్య విభాగం అధికారుల సమక్షంలో వధించాల్సి ఉంటుంది. ఒక జంతువును వధించినప్పుడు ఇతర జంతువులకు కనిపించకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వధించిన తర్వాత వాటిని పరిశుభ్రత, ఆహార భద్రతకు విఘాతం కలగకుండా ప్రత్యేక వాహనాల్లో దుకాణాలకు రవాణా చేయాల్సి ఉంటుంది. నగరంలో ఇంకెక్కడా జంతువులను వధించేందుకు అనుమతి లేదు. కానీ కొంతమంది వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా జంతు క్రూరత్వ నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జనావాసాల మధ్య ఇళ్లలోనే కబేళాలు ఏర్పాటుచేసుకుంటున్నారు. పశుమాంసం విక్రయానికి జీవీఎంసీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకుని వాటి ముసుగులో ఆవులను వధిస్తున్నారు.
విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల నుంచి ఆవులను కొనుగోలు చేసి, రాత్రిపూట వ్యాన్‌లు, కంటెయినర్లలో నగరానికి తీసుకువస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా తమ స్థలాల్లో దింపుతున్నారు. రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము వరకు అనధికార కబేళాలో ఆవులను వధించి మాంసాన్ని నగరంలోని దుకాణాలతోపాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల వ్యాన్‌లో నగరం నుంచి సుమారు 600 కిలోల ఆవు మాంసాన్ని తరలిస్తుండగా ఆనందపురం వద్ద పోలీసులు పట్టుకుని కేసు నమోదుచేశారు.
ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని అధికారులు
అనధికార కబేళాల నిర్వాహకులు పశువులను వధించినప్పుడు వచ్చే రక్తాన్ని నేరుగా డ్రైనేజీల్లోకి వదిలేస్తున్నారు. దీనివల్ల దుర్వాసన వెదజల్లడంతోపాటు దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. అలాగే ఎముకలు, ఇతర వ్యర్థాలను సమీపంలోని డంపర్‌బిన్లలో పడేస్తున్నారు. పశుమాంసం విక్రయం పేరుతో అనుమతి తీసుకుని యథేచ్ఛగా ఆవులను వధిస్తున్నా అధికారుల కళ్లకు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్థానికులు తమకు కబేళా వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరిస్తూ వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా కనీసం చర్యలకు ఉపక్రమించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆవులను హింసించడం, వధించడం తీవ్రమైన నేరం. అలా ఎవరైనా చేస్తే జంతు క్రూరత్వ నిరోధక చట్టం-1977 కింద కఠినమైన చర్యలు తీసుకునే అధికారం పోలీస్, ప్రజారోగ్యశాఖ అధికారులకు అప్పగించింది. కానీ ఆయా శాఖల అధికారులు ఎందుచేతనో అనధికార కబేళాలు, గోవధకు అడ్డుకట్ట వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒక్కో దుకాణం నుంచి పోలీసులు, జీవీఎంసీ అధికారులకు భారీగా మామూళ్లు అందడ ం వల్లే చర్యలకు వెనుకాడుతున్నారని ఆరోపిస్తున్నారు.
గోవులను వధించడం నేరం
డాక్టర్ రవిరాజు, జీవీఎంసీ చీఫ్ వెటర్నరీ అధికారి
ఎక్కడైనా గోవులను వధించడం తీవ్రమైన నేరం. నగరంలో మారికవలసలో మాత్రమే కబేళాకు అనుమతి ఉంది. అక్కడ కూడా గోవులను వధించడం నిషేధం. నగరంలో కొందరు పశుమాంసం విక్రయించడానికి ట్రేడ్ లైసెన్స్ తీసుకుని కబేళా నిర్వహిస్తున్నట్టు తెలిసింది. నేను ఇటీవలే బాధ్యతలు చేపట్టాను. త్వరలోనే కమిషనర్ అనుమతితో పోలీసుల సహాయం తీసుకుని అనధికార కబేళాలపై స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తాం. నిర్వాహకులు ఎంతటివారైనా కేసులు నమోదుచేస్తాం. పశుమాంసం విక్రయించేవారు విధిగా మారికవలస నుంచి మాత్రమే మాంసం తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇళ్లలో పశువులను వధిస్తే నీరు, పరిసరాలు కలుషితమై అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అలాంటివారికి ముకుతాడు వేస్తాం.