అనుమానాస్పద స్థితిలో దంపతుల మృతి
ABN , Publish Date - Nov 03 , 2025 | 01:02 AM
అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతిచెందారు.
అక్కయ్యపాలెం సంఘం ఆఫీసు వద్ద ఘటన
ఉరి వేసుకున్న భర్త, మంచంపై భార్య మృతదేహం
ఆమె ఏడు నెలల గర్భవతి
సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
సీతంపేట, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి):
అనుమానాస్పద స్థితిలో దంపతులు మృతిచెందారు. ఈ సంఘటన అక్కయ్యపాలెం సంఘం ఆఫీసు సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...
అక్కయ్యపాలెం సంఘం ఆఫీస్ వద్ద సూరిశెట్టి వాసుదేవరావు (34), తన తల్లి, భార్య అనిత (25)తో కలిసి దంపతులు నివాసం ఉంటున్నారు. వాసుదేవరావు చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తుంటాడు. కాగా బంధువుల ఇంట శుభ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వాసుదేవరావు తల్లి ఆదివారం ఉదయం మధురవాడ వెళ్లింది. తిరిగి రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకుంది. ఎంతసేపు తలుపులు కొట్టినా ఎవరూ తీయలేదు. దీంతో రైల్వే న్యూకాలనీలో ఉన్న తన కుమార్తెకు ఫోన్ చేసి, తలుపు కొట్టినా తీయడం లేదని తెలిపింది. దీంతో వారు అక్కడికి చేరుకుని, పక్క ఇంట్లో నుంచి తమ ఇంటి కిటికీ తెరిచి చూడగా, వాసుదేవరావు ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఆ పక్కనే మంచంపై అనిత పడి ఉండడం గమనించి ఆందోళనతో వెంటనే నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతేకాకుండా ఇంటి తలుపులకు వేసిన తాళాలు విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. బెడ్‌రూమ్ తలుపులు కూడా వేసి ఉండడంతో వాటిని కూడా విరగ్గొట్టి ప్రవేశించారు. అప్పటికే వాసుదేవరావు మృతిచెందగా, అనిత స్పృహలేకుండా పడి ఉంది. ఆమె ఏడు నెలల గర్భిణి కావడంతో కడుపులో బిడ్డ బతికే అవకాశం ఉందనే భావనతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
వాసుదేవరావు ఉరివేసుకుని ఉండడంతో ఆత్మహత్యగానే భావిస్తున్నారు. అయితే అనిత మంచం వద్ద పడి ఉండడం, ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆమె మృతి మిస్టరీగా మారింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోటకు చెందిన అనితతో వాసుదేవరావు వివాహం ఏడాది కిందట జరిగింది. దంపతుల మధ్య ఎటువంటి గొడవలు లేవని బంధువులు చెబుతున్నారు. అన్యోన్యంగా ఉండేవారంటున్నారు. ఈ నేపథ్యంలో దంపతుల మృతికి కారణాలేమిటనేది తెలియరావడం లేదు. సంఘటన స్థలంలో క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తున్నారు. నాలుగో పట్టణ సీఐ ఉమాకాంత్ సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. దంపతుల మృతితో మృతుడి తల్లి, సోదరితో పాటు బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.