ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభం
ABN , Publish Date - Jun 12 , 2025 | 01:17 AM
సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీల) బదిలీ కౌన్సెలింగ్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. జడ్పీ సమావేశ మందిరంలో ప్రారంభమైన కౌన్సెలింగ్ విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ పర్యవేక్షణలో కొనసాగింది. బదిలీలకు సంబంధించి ఎస్జీటీలతో రూపొందించిన సీనియారిటీ జాబితాలో ఒకటి నుంచి 300 వరకు టీచర్లకు బదిలీ చేశారు.
- తొలిరోజు 300 మందికి స్థానచలనం
- నేడు 301 నుంచి 800 వరకూ కౌన్సెలింగ్
విశాఖపట్నం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి):
సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీల) బదిలీ కౌన్సెలింగ్ బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. జడ్పీ సమావేశ మందిరంలో ప్రారంభమైన కౌన్సెలింగ్ విశాఖ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ పర్యవేక్షణలో కొనసాగింది. బదిలీలకు సంబంధించి ఎస్జీటీలతో రూపొందించిన సీనియారిటీ జాబితాలో ఒకటి నుంచి 300 వరకు టీచర్లకు బదిలీ చేశారు. ప్రతి టీచర్‌ను పిలిచి వారికి కొన్ని స్కూళ్ల వివరాలు చూపిస్తున్నారు. అందులో ఆప్షన్‌గా ఎంచుకున్న స్కూల్‌కు బదిలీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ బుధవారం రాత్రి 10.30 గంటల వరకు కొనసాగింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ మంగళవారం ప్రారంభం కావాలి. అయితే సాంకేతిక సమస్య కారణంగా కౌన్సెలింగ్ బుధవారానికి వాయిదా వేశారు. దీంతో బుధవారం మధ్యాహ్నం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించారు. గురువారం సీనియారిటీ జాబితాలో 301 నుంచి 800 వరకు అంటే 500 మందికి బదిలీలు నిర్వహిస్తారు.
బదిలీ టీచర్లకు ఆన్‌డ్యూటీ సౌకర్యం
గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నిబంధనల మేరకు ప్రతి టీచర్ పునఃప్రారంభం రోజున విధిగా స్కూల్‌కు హాజరుకావాలి. అయితే గురువారం నిర్వహించనున్న బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే టీచర్లకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పించారు. ఒకవేళ ఒక స్కూల్‌లో ఇద్దరు టీచర్లు కౌన్సెలింగ్‌కు వస్తే సమీపంలోని పాఠశాలలో పనిచేసే ఎంటీఎస్ టీచర్‌కు సదరు పాఠశాల నిర్వహణ బాధ్యత అప్పగించాలి. ఈ విషయాన్ని డీఈవో ప్రేమ్‌కుమార్ తెలిపారు.