Share News

వెలుగు చూసిన అవినీతి

ABN , Publish Date - Sep 21 , 2025 | 12:10 AM

జిల్లాలోని హుకుంపేటలో వెలుగుకు చెందిన రైతు ఉత్పత్తిదారుల సంఘంలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు విశఽ్వసనీయంగా తెలిసింది. గిరిజన రైతుల కోసం ప్రభుత్వం విడుదల చేసే సొమ్ములో సుమారుగా రూ.30 లక్షలు వరకు స్వాహా జరిగిందని, సంఘంలోని సభ్యులే ఆ నిధులను కాజేశారని తెలుస్తున్నది.

వెలుగు చూసిన అవినీతి
హుకుంపేటలోని వెలుగుకు చెందిన రైతు ఉత్పత్తిదారుల సంఘం భవనం

రైతు ఉత్పత్తిదారుల సంఘంలో రూ.30 లక్షలు మాయం

సంఘం సభ్యులే స్వాహా చేశారని బలంగా ఆరోపణలు

చురుగ్గా అంతర్గత విచారణ

బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టే అవకాశం?

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని హుకుంపేటలో వెలుగుకు చెందిన రైతు ఉత్పత్తిదారుల సంఘంలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు విశఽ్వసనీయంగా తెలిసింది. గిరిజన రైతుల కోసం ప్రభుత్వం విడుదల చేసే సొమ్ములో సుమారుగా రూ.30 లక్షలు వరకు స్వాహా జరిగిందని, సంఘంలోని సభ్యులే ఆ నిధులను కాజేశారని తెలుస్తున్నది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు, అంతర్గతంగా ఈ అక్రమ వ్యవహారంపై విచారణ చేపడుతున్నారు. సమగ్ర విచారణ పూర్తయితే అందుకు బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

రైతులకు మేలు చేయాలని సంఘాలు పెడితే...

గిరిజన రైతులకు మేలు జరగాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధి సంస్థ(వెలుగు) ఆధ్వర్యంలో మన్యంలోని ప్రతి మండల కేంద్రంలో ఒకటి చొప్పున మహిళలతో ఏజెన్సీలో పదకొండు రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేశారు. అలాగే వాటికి అవసరమైన అనుమతులు, ఇతర అధికారిక వ్యవహారాలను సైతం వెలుగు అధికారులే చేపట్టారు. ఆయా సంఘాల్లో 300 నుంచి వెయ్యి మంది వరకు గిరిజన రైతులను సభ్యులుగా చేర్పించుకునే వెసులుబాటుతోపాటు సభ్యుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం నుంచి రుణాలు, వ్యవసాయ యంత్రాలు, తదితరాలను అందిస్తారు. ఈ క్రమంలో ఒక్కో రైతు ఉత్పత్తిదారుల సంఘానికి రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదలయ్యాయి. ఆయా నిధులతో రైతులకు రుణాలు, అవసరమైన ఉద్యానవన, వ్యవసాయ యంత్ర పరికరాలు అందిస్తారు. హుకుంపేటలోని వెలుగుకు చెందిన రైతు ఉత్పత్తిదారుల సంఘానికి ఇచ్చిన నిధుల్లో సుమారు రూ.30 లక్షలు మాయమైనట్టు వెలుగు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో వెలుగుకు చెందిన ముగ్గురు డివిజన్‌ స్థాయి అధికారులతో ఈ అక్రమ వ్యవహారంపై అంతర్గత విచారణ చేపడుతున్నారు. కాగా హుకుంపేటలోని రైతు ఉత్పత్తిదారుల సంఘంలో రూ.30 లక్షలను మాయం చేశారని పలువురు రైతులు కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

బాధ్యులపై క్రిమినల్‌ కేసులు తప్పవా?

వెలుగుకు చెందిన హుకుంపేట రైతు ఉత్పత్తిదారుల సంఘంలో రూ.30 లక్షలు స్వాహా వ్యవహారంలో బాధ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టే అవకాశం లేకపోలేదని వెలుగు అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై అంతర్గతంగా విచారణ చేపడుతుండగా, కలెక్టర్‌కు రైతులు ఇచ్చిన ఫిర్యాదుపై ఆయన సైతం స్పందించి, సమగ్ర విచారణ, బాధ్యులపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తారని తెలుస్తున్నది. ఒక రైతు ఉత్పత్తిదారుల సంఘంలో రూ.30 లక్షలు మాయం చేయడం చిన్న విషయం కాదని, బాధ్యులపై కఠిన చర్యలతోపాటు క్రిమినల్‌ కేసులు పెట్టడడం ఖాయమని వెలుగులో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. అయితే గిరిజన రైతుల కోసం ప్రభుత్వం మంజూరు చేసే సొమ్మును స్వాహా చేయడం దారుణమని, అటువంటి వారిపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Sep 21 , 2025 | 12:10 AM