Share News

జీవీఎంసీలో అవినీతి రాకెట్‌!

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:44 AM

‘జీవీఎంసీలో పెద్దఎత్తున అవినీతి రాకెట్‌ నడుస్తోంది. త్వరలోనే దానిని బయటకు తీస్తా.’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చేసిన వ్యాఖ్యలు జీవీఎంసీ అధికారుల్లో గుబులురేపుతోంది.

జీవీఎంసీలో అవినీతి రాకెట్‌!

అధికారులపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా ఆగ్రహం

డీఆర్‌సీలో జీవీఎంసీ పనితీరుపైనే ప్రధాన చర్చ

ప్రజారోగ్యం, టౌన్‌ప్లానింగ్‌, ఇంజనీరింగ్‌ విభాగాలపై ఎమ్మెల్యేల ఫిర్యాదు

త్వరలోనే రాకెట్‌ను బయటకు తీస్తానన్న మంత్రి

జీవీఎంసీ అధికారుల్లో గుబులు

(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

‘జీవీఎంసీలో పెద్దఎత్తున అవినీతి రాకెట్‌ నడుస్తోంది. త్వరలోనే దానిని బయటకు తీస్తా.’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి చేసిన వ్యాఖ్యలు జీవీఎంసీ అధికారుల్లో గుబులురేపుతోంది. తమ విభాగం లో ఎక్కడ ఎలాంటి అవినీతి జరుగుతుందోనని కొందరు అధికారులు సమీక్షించుకునేపనిలో పడితే... మరికొందరు తమ అవినీతి, అక్రమాలు ఎక్కడ బయటపడతాయోననని ఆందోళన చెందుతున్నారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అధ్యక్షతన శనివారం కలెక్టరేట్‌లో జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు జీవీఎంసీ పనితీరుపై తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ తీసికట్టుగా ఉందని, వీధిదీపాలు సరిగా వెలగడం లేదని, డ్రెయిన్లు, గెడ్డలు కబ్జాకు గురవుతున్నా జీవీఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యేలంతా ఫిర్యాదులు గుప్పించారు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ మాట్లాడుతూ తన నియోజకవర్గం పరిధిలో ప్రజారోగ్య విభాగంలో కొందరు పనిచేయకుండానే జీతాలు తీసుకుంటున్నారని, దీనిపై కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని ఇన్‌చార్జి మంత్రికి ఫిర్యాదుచేశారు. దీనిపై జోన్‌-4 కమిషనర్‌ మల్లయ్యనాయుడు వివరణ ఇస్తూ అలాంటిదేమీ లేదని, అందరూ కచ్చితంగా పనిచేస్తేనే జీతాలు అందుతాయని చెప్పడంతో మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గంట సమయం ఇస్తానని, ఎమ్మెల్యే చెప్పిన పది మంది కార్మికులు ఎక్కడెక్కడ విధులు నిర్వర్తించారనే దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఉంటే తీసుకురావాలని ఆదేశించారు. కానీ జోనల్‌ కమిషనర్‌ వాటిని తీసుకురాలేకపోవడంతో జీవీఎంసీ పనితీరుపై తీవ్రస్థాయిలో ఇన్‌చార్జి మంత్రి ఆరోపణలు గుప్పించారు.

జీవీఎంసీలో కొంతమంది సర్వేయర్లు ప్రైవేటు వ్యక్తులకు అనుకూల నివేదికలిస్తున్నారన్నారు. దీనిపై ఎమ్మెల్యేలు పలుమార్లు ప్రస్తావించారని, చీఫ్‌ సిటీప్లానర్‌ సమావేశానికి రాకపోవడంతో చాలామంది ఎమ్మెల్యేలు తమ ఫిర్యాదులను బయటపెట్టలేకపోయారన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో అవినీతి జరుగుతున్న సమాచారం తన వద్ద ఉందన్నారు. పెద్దఎత్తున నిధులను కొల్లగొట్టే రాకెట్‌ నడుస్తోందని, త్వరలోనే దీనిని బయటకు తీస్తానని హెచ్చరించినట్టు కొందరు ఎమ్మెల్యేలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. జీవీఎంసీలో కొంతకాలంగా రాత్రిఫుడ్‌కోర్ట్‌పై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. కౌన్సిల్‌ మీటింగ్‌ జరిగిన ప్రతి సారీ ఫుడ్‌కోర్ట్‌ను తొలగించాలని సభ్యుడు డిమాండ్‌ చేయడం, తక్షణం తొలగించాలని మేయర్‌ ఆదేశాలు ఇలివ్వడం పరిపాటిగా మారింది. దీనివెనుక కొందరు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే కోడివ్యర్థాలను చేపల చెరువులకు తరలింపు అంశంపై కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల మధ్య పెద్దయుద్ధమే జరుగుతోంది. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయనే ఆరోపణలున్నాయి. టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో సర్వేయర్లు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా నివేదికలను ఇచ్చి పార్కులు, గెడ్డలను అన్యాక్రాంతం చేస్తున్నారని చెబుతున్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరు అధికారులు, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై వారికి అనుకూలంగా అంచనాలు తయారుచేయడం, టెండర్లను అస్మదీయులకు వచ్చేలా సహకరించి, భారీగా జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యూసీడీ విభాగంలో మహిళా సంఘాల ఆడిట్‌ పేరుతో సిబ్బంది పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులున్నాయి. వీటన్నింటిపైనా ఇన్‌ఛార్జి మంత్రికి పూర్తి సమాచారం అందడంతోనే జీవీఎంసీలో అవినీతి రాకెట్‌ నడుస్తోందని వ్యాఖ్యానించి ఉంటారనే అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖలు జీవీఎంసీలోని కొందరు అధికారుల్లో గుబులురేపుతున్నాయి. ఏక్షణంలో సమీక్ష పేరుతో జీవీఎంసీకి వచ్చి తమ అవినీతి, అక్రమాలను నేరుగా బయటపెడతారోనని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Sep 08 , 2025 | 12:44 AM