Share News

రెవెన్యూలో అవినీతి ఊడలు

ABN , Publish Date - Sep 06 , 2025 | 01:16 AM

ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా.. పాలకులు ఎంత మంది మారినా.. రెవెన్యూ శాఖలో అవినీతికి మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. ఏ పని జరగాలన్నా ఆయా ఉద్యోగుల స్థాయిని, సంబంధిత పనినిబట్టి లంచం డిమాండ్‌ చేయడం ఆనవాయితీగా మారింది. అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడుతున్నా, కేసులు నమోదు అవుతున్నా.. లంచాలు తీసుకోవడానికి మాత్రం వెరవడంలేదు. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి, డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద రెవెన్యూ శాఖలో అవినీతి ఊడలు బలంగా నాటుకుపోయాయి.

రెవెన్యూలో అవినీతి ఊడలు
కశింకోట తహశీల్దారు కార్యాలయం

ప్రతీ పనికి ఓ రేటు

లంచం ఇస్తేనే దరఖాస్తులకు మోక్షం

వీఆర్వోలు, సర్వేయర్లే కీలక పాత్రం

వసూలు చేసిన సొమ్ములో కింద నుంచి పైవరకు వాటాలు

ప్రభుత్వాలు మారినా.. తీరుమారని రెవెన్యూ శాఖ

ప్రక్షాళనకు దృష్టి సారించని పాలకులు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా.. పాలకులు ఎంత మంది మారినా.. రెవెన్యూ శాఖలో అవినీతికి మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. ఏ పని జరగాలన్నా ఆయా ఉద్యోగుల స్థాయిని, సంబంధిత పనినిబట్టి లంచం డిమాండ్‌ చేయడం ఆనవాయితీగా మారింది. అవినీతి నిరోధక శాఖ దాడుల్లో పట్టుబడుతున్నా, కేసులు నమోదు అవుతున్నా.. లంచాలు తీసుకోవడానికి మాత్రం వెరవడంలేదు. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి, డబ్బులు దండుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం మీద రెవెన్యూ శాఖలో అవినీతి ఊడలు బలంగా నాటుకుపోయాయి.

కశింకోట మండలం నర్సింగబిల్లి రెవెన్యూ జట్టపురెడ్డి తుని వీఆర్వో గన్నమరాజు శ్రీసూర్యకృష్ణ పృథ్వీ, ఓ రైతుకు వారసత్వంగా దఖలు పడిన భూమికి మ్యుటేషన్‌ చేసేందుకు గురువారం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన వైనం రెవెన్యూ శాఖలో అవినీతిపై మరోసారి చర్చనీయాంశమైంది. దీనిపై సొంత శాఖలోనే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా చర్చ జరుగుతున్నది. పట్టాదారు పాసు పుస్తకాల జారీ, భూ బదలాయింపు, భూ రికార్డుల్లో తప్పుల సవరణ, వారసత్వ ఆస్తి బదలాయింపు (మ్యుటేషన్‌), వివిధ రకాల ధ్రువపత్రాల జారీ.. ఇలా రెవెన్యూ పరంగా ఏ పనిజరగాలన్నా డబ్బులు ఇవ్వాల్సిందే. మ్యుటేషన్‌, పాసుపుస్తకాల జారీ కోసం ఎకరాకు రూ.10 వేలకు తక్కువ కాకుండా డిమాండ్‌ చేస్తున్నారు. భూమి విలువ ఎంత ఎక్కువ వుంటే.. లంచం రేటు అంత ఎక్కువ పెరుగుతుంది.

వీఆర్వోలు, సర్వేయర్లే కీలక పాత్ర!

వెబ్‌ల్యాండ్‌ లాగిన్‌ కీ తహశీల్దార్ల ఆధీనంలో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో భూముల రికార్డుల్లో మార్పులు, చేర్పుల్లో వీఆర్‌ఓలు, సర్వేయర్లే కీలక పాత్ర పోషిస్తూ సొమ్ములు వసూలు చేస్తుంటారు. భూముల విషయంలో తహశీల్దార్లకు అందిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో విచారణ కోసం వీఆర్‌ఓలు, సర్వేయర్లను పంపుతుంటారు. ఈ క్రమంలో ఆయా దరఖాస్తుదారులతో వీఆర్‌ఓలు, సర్వేయర్లు బేరాలు కుదుర్చుకొని పనులు చక్కబెడుతుంటారు. లంచంగా అందుకున్న సొమ్ములో కింది నుంచి పైస్థాయి వరకు హోదానుబట్టి వారికి ముట్టజెబుతుంటారు. భూములకు సంబంధించి రెండు వర్గాల మధ్య ఏర్పడిన వివాదాల్లో వీఆర్‌ఓలు, సర్వేయర్లు జోక్యం చేసుకుంటున్నారు. అవి ప్రభుత్వ భూములైతే వీరు తెరవెనుక ఉండి ఫిర్యాదులు చేయిస్తారు. అనంతరం అక్కడ వాలిపోయి ప్రభుత్వ భూమి అంటూ యాగీ చేసి, ఇరువర్గాల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. జాతీయ రహదారి పక్కనవున్న అనకాపల్లి, కశింకోట, ఎలమంచిలి, ఎస్‌.రాయవరం, నక్కపల్లి, పాయకరావుటేట మండలాల్లో వివాదాలు ఎక్కువగా వున్న ప్రభుత్వ భూముల విషయంలో వీఆర్‌ఓలు, సర్వేయర్లు తలదూర్చుతున్నారు.

రోలుగుంట తహశీల్దారు కార్యాలయంలో 2023లో ఏసీబీ సోదాలు అయ్యాయి. అప్పట్లో తహశీల్దారు, డిప్యూటీ తహశీల్దారు, వీఆర్‌ఓలు అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో కూటమి ప్రభుత్వం ఇటీవల తదుపరి విచారణకు ఆదేశించింది.

అనకాపల్లి మండలం కోడూరులో ఏపీఐఐసీకి చెందిన సుమారు ఎకరా భూమిని గతంలో ఇక్కడ వీఆర్‌ఓగా పనిచేసిన ఒక వ్యక్తి తన కటుంబ సభ్యుల పేరున రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేసుకొని, ఆ భూమిని మళ్లీ ప్రభుత్వానికే విక్రయించాడు. ఇదే గ్రామంలో 25 మందికి భూములు ఉన్నట్టు రికార్డులో చూపించి, ల్యాండ్‌ పూలింగ్‌ తరువాత ఆయా బినామీల పేర్లకు రూ.6 కోట్లకుపైగా పరిహారం చెల్లించే విధంగా పావులు కదిపారు. రెవెన్యూ శాఖపై పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ ఉన్నతాధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.

Updated Date - Sep 06 , 2025 | 01:16 AM