అవినీతి అనకొండ
ABN , Publish Date - Aug 08 , 2025 | 01:10 AM
విజయవాడలో రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఎ.శ్రీనివాస్ విశాఖపట్నం సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు.
విజయవాడలో రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం విశాఖపట్నం ఎస్‌ఈ శ్రీనివాస్
ఈఎన్‌సీ కూడా ఆయనే...
ఏ ప్రభుత్వం ఉన్నా ఆయనదే హవా
బిల్లు మంజూరు చేయాలంటే కాంట్రాక్టర్లు ఒక శాతం ముందే ముట్టజెప్పాలి
నెలాఖరుకు పదవీ విరమణ
ఈలోగా రూ.ఐదు కోట్ల వసూళ్ల లక్ష్యం...సిబ్బందిపై ఒత్తిడి
ఆ నేపథ్యంలోనే ఏసీబీకి దొరికిన వైనం
విశాఖపట్నం, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి):
విజయవాడలో రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం చీఫ్ ఎ.శ్రీనివాస్ విశాఖపట్నం సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన అక్రమాల గురించి సిబ్బంది, కాంట్రాక్టర్లు ఇప్పుడు పెదవి విప్పుతున్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్ నుంచి ఈఈ వరకూ ప్రతి ఒక్కరూ ఆయన వేధింపులకు గురైనవారేనని అంటున్నారు.
నగరంలోని ఉషోదయ జంక్షన్ సమీపాన గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఉంది. అక్కడ ఎస్‌ఈగా ఉన్న శ్రీనివాస్ ఏ ప్రభుత్వం వచ్చినా ఉన్నతాధికారుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకూ ప్రతి ఒక్కరినీ మచ్చిక చేసుకుని చక్రం తిప్పారు. గత ప్రభుత్వంలో తన సామాజిక వర్గానికి చెందిన మంత్రి అండదండలతో హవా నడిపిన ఆయన...కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒకే సామాజిక వర్గమంటూ ఒక మంత్రికి దగ్గరయ్యారు. విశాఖలో ఎస్‌ఈగా, విజయవాడలో ఈఎన్‌సీగా...రెండు పోస్టుల్లో తానే కొనసాగేలా చక్రం తిప్పారు. విభాగంలో తనకు ఎవరు పోటీ ఉండకూడదని కుట్రతో తనతోపాటు డీఈగా పదోన్నతి పొందిన అధికారిపై లేనిపోని ఫిర్యాదులు చేశారు. ఆ అధికారి ఇప్పటికీ డీఈగానే ఉండగా, శ్రీనివాస్ మాత్రం ఈఈ, ఎస్‌ఈ, సీఈ, చివరకు ఈఎస్‌సీ వరకూ పదోన్నతులు పొందారు. గత ప్రభుత్వంలో తనకున్న పలుకుబడి ఉపయోగించి పార్వతీపురంలో ఎస్‌ఈగా పనిచేసిన వ్యక్తిని సస్పెండ్ చేయించడంతోపాటు అక్కడ కార్యాలయాన్ని ఎత్తివేయించారు. ప్రస్తుతం విశాఖలోని ఎస్‌ఈ కార్యాలయం పరిధిలోకి ఉత్తరాంధ్రలో ఆరు జిల్లాలు ఉండేలా మేనేజ్ చేసుకున్నారు. తనను ఎదిరించి గట్టిగా ప్రశ్నించిన ఒక ఈఈని ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకు బదిలీ చేశారు. ఇటీవల ఒక ఏఈని సస్పెండ్ చేశారు.
ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న శ్రీనివాస్ అధికారంలో ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడి ఏసీబీకి చిక్కారు. ఈ నెలలో పదవీ విరమణ చేసేలోగా ఐదు కోట్ల రూపాయలు వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏఈ నుంచి ఈఈ వరకు ప్రతి ఒక్కరికీ లక్ష్యాలు విధించారంటున్నారు. సొమ్ములివ్వని అధికారులపై చర్యలకు ఉపక్రమించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా పనులకు సంబంధించి బిల్లుల మంజూరుకు కాంట్రాక్టర్లను పీడించి లంచాలు వసూలు చేసేవారని ఒకరు ఆరోపించారు. బిల్లు ఆమోదించాలంటే ఒక శాతం ముందుగానే ముట్టజెప్పాలి. విశాఖ ఎస్‌ఈ కార్యాలయం పరిధిలో ఇటీవల కోట్ల రూపాయిల బిల్లులు మంజూరుచేశారు. కాంట్రాక్టర్లు చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఈ ఏడాది మార్చిలోగా మంజూరుకాకపోతే తిరిగి సీఎఫ్‌ఎంఎస్‌లో అప్‌లోడ్ చేయాలి. కానీ ఆ విషయాన్ని కాంట్రాక్టర్లకు చెప్పలేదు. దీనిపై కొందరు కాంట్రాక్టర్లు ఇటీవల విశాఖ వచ్చిన మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదుచేశారు. కొసమెరుపు ఏమిటంటే...ఏసీబీకి పట్టించిన కాంట్రాక్టర్లు, ఈఎన్‌సీ శ్రీనివాస్ ఒకప్పుడు మంచి మిత్రులు. మిత్రులైనా పైసలు ఇవ్వకపోతే బిల్లు మంజూరుచేసేది లేదని తెగేసి చెప్పడంతో ఏసీబీకి పట్టించేంత వరకూ వెళ్లినట్టు తెలిసింది. కాగా ఏసీబీకి దొరికిన శ్రీనివాస్ వేధింపులు, అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని కూటమి పార్టీ సానుభూతిపరుడైన కాంట్రాక్టర్ ఒకరు వెల్లడించారు.