Share News

యథా కార్పొరేటర్లు! తథా అధికారులు!!

ABN , Publish Date - Aug 06 , 2025 | 01:23 AM

పాత జైలురోడ్డులో అనధికారికంగా నడుస్తున్న నైట్‌ ఫుడ్‌కోర్టును తొలగించాలంటూ ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేశారు. ఇప్పటికీ అక్కడ ఫుడ్‌కోర్ట్‌ కొనసాగుతోంది.

యథా కార్పొరేటర్లు! తథా అధికారులు!!

  • జీవీఎంసీ కౌన్సిల్‌లో చేసిన తీర్మానాలకు దిక్కేది??

  • అమలు కాకపోయినా పట్టించుకోని ప్రజా ప్రతినిధులు

  • దాంతో అధికారుల్లో నిర్లక్ష్యం

  • నగర పాలక సంస్థ ఆదాయానికి గండి పడుతున్నా చోద్యం చూస్తున్న
    వైనం వాటికి విలువ లేనప్పుడు రూ.లక్షలు

  • ఖర్చుపెట్టి సమావేశాలు ఎందుకు?

  • కొత్త మేయర్‌ అయినా తీర్మానాలు అమలుకి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పాత జైలురోడ్డులో అనధికారికంగా నడుస్తున్న నైట్‌ ఫుడ్‌కోర్టును తొలగించాలంటూ ఈ ఏడాది జనవరి నెలలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేశారు. ఇప్పటికీ అక్కడ ఫుడ్‌కోర్ట్‌ కొనసాగుతోంది.

వన్‌టౌన్‌లోని హోల్‌సేల్‌ ఫ్రూట్‌మార్కెట్‌తోపాటు జ్ఞానాపురంలోని హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌లో దుకాణాల అద్దెలు అతిస్వల్పంగా ఉన్నందున వాటిని ప్రస్తుత మార్కెట్‌ అద్దెలకు అనుగుణంగా పెంచాలని దాదాపు రెండేళ్ల కిందట కౌన్సిల్‌లో తీర్మానం చేశారు. ఇప్పటికీ వాటి అద్దెల జోలికి వెళ్లలేదు.

స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు గడువు ముగిసినందున జీవీఎంసీ పరిధిలో ఇకపై స్మార్ట్‌ సిటీ కార్యకలాపాలను పొడిగించడానికి వీల్లేదని ఈ ఏడాది జూన్‌ ఆరున జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌ స్వయంగా తీర్మానం చేశారు. కానీ నగరంలో చేపట్టబోయే వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టళ్ల పనులు స్మార్ట్‌సిటీ ఆధ్వర్యంలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు.

జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో చేసిన తీర్మానాలు క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదనడానికి కేవలం ఇవి ఉదాహరణలు మాత్రమే. ఎంతో అట్టహాసంగా జరిపే కౌన్సిల్‌ సమావేశాల్లో పాలకవర్గం చేస్తున్న తీర్మానాలను అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీంతో కౌన్సిల్‌లో చేస్తున్న తీర్మానాలు మొక్కుబడిగా మారిపోతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ పరిధిలో రూ.50 లక్షలకు పైబడిన పనులు, ఉద్యోగుల సర్వీస్‌కు సంబంధించిన అంశాలు, నగర పాలక సంస్థకు చెందిన విలువైన ఆస్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే కౌన్సిల్‌లో చర్చించిన తర్వాత మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి అనుగుణంగా తీర్మానం చేయాల్సి ఉంటుంది. కౌన్సిల్‌లో జరిగే తీర్మానాలను అధికారులు రిజిస్టర్‌లో నమోదుచేసి ఒక్కో తీర్మానానికి ఒక్కో ఆర్డర్‌ నంబర్‌ కేటాయిస్తారు. కౌన్సిల్‌ సమావేశం జరిగిన తర్వాత ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలను సంబంధిత అధికారులు అమలు చేయడం, తదుపరిచర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టాలి. తర్వాత జరిగే కౌన్సిల్‌ సమావేశం నాటికి గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై తీసుకున్న చర్యలను సభ్యులకు అందజేయాలి. కానీ పాలకవర్గం ఏర్పడి దాదాపు నాలుగున్నరేళ్లు కావొస్తోంది. కౌన్సిల్‌ సమావేశాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలను మినహాయిస్తే పాలనాపరంగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన తీర్మానాలు అమలు జరిగిన దాఖలాలు కనిపించడం లేదు. గతంలో చేసిన తీర్మానాల అమలు గురించి కార్పొరేటర్లు పట్టించుకోకపోవడంతో అధికారులు కూడా వాటిని సీరియస్‌గా తీసుకోవడం మానేశారు.

సమావేశం కోసం రూ.లక్షలు ప్రజాధనం ఖర్చు

మూడు నెలలకు ఒకసారి కౌన్సిల్‌ తప్పనిసరిగా సమావేశం కావాల్సి ఉంటుంది. ఒకసారి కౌన్సిల్‌ సమావేశం జరిగితే 97 మంది కార్పొరేటర్లు, ఐదుగురు కో-ఆప్షన్‌ సభ్యులు, 14 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులతోపాటు అధికారులు, కార్పొరేటర్ల అనుచరులు పాల్గొంటారు. అందరికీ ఉదయం టీ, స్నాక్స్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్లీ టీ, స్నాక్స్‌ అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే సభ్యులకు కౌన్సిల్‌ హాల్‌లో మంచినీరు, శానిటైజర్‌ వంటివి అందజేసేందుకు ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటన్నింటి కోసం ఒక్కో సమావేశానికి రూ.లక్షల్లో ఖర్చుపెడుతున్నారు. అంత ప్రజాధనం వెచ్చించి నగరవాసుల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకునేందుకు సమావేశాలు ఏర్పాటుచేస్తున్నాసరే ప్రయోజనం ఉండడం లేదనే వాదనే వినిపిస్తోంది. ముఖ్యంగా జీవీఎంసీకి ఆదాయం వచ్చే మార్గాలను దెబ్బకొడుతున్న వారిపై చర్యలకు వెనుకాడుతున్నారు. అవినీతి అంశాలపై చర్యలకు సిద్ధపడినట్టు తీర్మానాలు చేసినా, వాటిని అమలు చేసేవిషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కౌన్సిల్‌లో వన్‌టౌన్‌ హోల్‌సేల్‌ ఫ్రూట్‌మార్కెట్‌, జ్ఞానాపురంలోని హల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌లో దుకాణాల అద్దెల్లో పెద్దఎత్తున గోల్‌మాల్‌ జరుగుతోందని అప్పటి ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. దానిపై స్పందించిన అప్పటి మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి ఆయా మార్కెట్లలో దుకాణాల అద్దెలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలుజారీచేశారు. ఏమైందో తెలియదుగానీ అన్ని పార్టీల కార్పొరేటర్లతో అఖిలపక్ష కమిటీని నియమించి అక్కడితో వదిలేశారు. ఇప్పటికీ దుకాణాల అద్దెలు మాత్రం పెంచలేదు. అలాగే పాతజైలురోడ్డులో అనధికారికంగా నడుస్తున్న ఫుడ్‌కోర్ట్‌ను తక్షణం తొలగించాలంటూ ఏడాది కిందట అప్పటి మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి తీర్మానం చేశారు. ఇప్పటికీ ఫుడ్‌కోర్ట్‌ నిరాటంకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్‌లో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుపై చర్చ జరిగినప్పుడు, ఆ ప్రాజెక్టు గడువు ముగిసినందున ఇకపై పొడిగించవద్దని అధికారులను మేయర్‌ పీలా శ్రీనివాసరావు ఆదేశించారు. కానీ నగరంలో మూడుచోట్ల కొత్తగా నిర్మించబోయే వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్లను స్మార్ట్‌ సిటీ ఆధ్వరంలోనే చేపట్టేలా అధికారులు కసరత్తు ప్రారంభించడం విశేషం. ఇప్పటికైనా కొత్త మేయర్‌ పీలా శ్రీనివాసరావు కౌన్సిల్‌ తీర్మానాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవడం ద్వారా కౌన్సిల్‌ ఔన్నత్యాన్ని కాపాడాలని కార్పొరేటర్లు కోరుతున్నారు.

Updated Date - Aug 06 , 2025 | 01:23 AM