Share News

యువ న్యాయవాదులకు పట్టాభిషేకం

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:50 AM

దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విశాఖలోని నోవాటెల్‌లో నిర్వహించిన ఈ వేడుకకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

యువ న్యాయవాదులకు పట్టాభిషేకం
మాట్లాడుతున్న సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌

ఉత్సాహంగా దామోదరం సంజీవయ్య లా వర్సిటీ స్నాతకోత్సవం

ఐదు బ్యాచ్‌లకు ఒకేసారి నిర్వహణ

అతిథులుగా హాజరైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

555 మంది విద్యార్థులకు పట్టాలు, 154 మంది విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ ప్రదానం

విశాఖపట్నం, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విశాఖలోని నోవాటెల్‌లో నిర్వహించిన ఈ వేడుకకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ మాట్లాడుతూ న్యాయ విద్యార్థులు క్రమశిక్షణ, హార్డ్‌వర్క్‌తో ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు అవకాశముందన్నారు. న్యాయవాదిగానే కాకుండా టీచింగ్‌, జ్యుడిషియల్‌ ఆఫీసర్‌ వంటి అనేక అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. సుప్రీంకోర్టు జడ్జి కావాలంటే కలగా భావించేవాడినని, అయితే. తాను జ్యుడిషియల్‌ సర్వీసెస్‌ రాయడం ద్వారా ఈ స్థాయికి చేరుకున్నట్టు తెలిపారు. న్యాయవాద వృత్తిలో వేగం కంటే క్వాలిటీ ముఖ్యమన్నారు. రోజువారీ వృత్తిలో అనేక కొత్త సవాళ్లు ఎదురవుతుంటాయని, వాటిని ఎదుర్కొనే సహనం కావాలని సూచించారు. స్నాతకోత్సవ సభకు అధ్యక్షత వహించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ విద్యార్థులతో ప్రమాణం చేయించారు. అనంతరం విద్యార్థులకు పట్టాలు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 154 మంది విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ పి.శ్రీనర్సింహ, వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.సూర్యప్రకాశ్‌, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ విశ్వచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవంలో భాగంగా లా వర్సిటీ 8, 9, 10, 11, 12 బ్యాచ్‌లకు చెందిన 555 మంది విద్యార్థులకు పట్టాలను, మరో 154 మంది విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ను ప్రదానం చేశారు. వీరిలో బీఏ ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన 397 మందికి, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసిన 153 మందికి, పీహెచ్‌డీ పూర్తి చేసిన నలుగురు, ఎల్‌ఎల్‌డీ పూర్తి చేసిన ఇద్దరికి పట్టాలను అందించారు.

తల్లిదండ్రుల్లో అసంతృప్తి

పట్టాల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఐదు బ్యాచ్‌లకు ఒకేసారి నిర్వహించడం పట్ల పలువురు తల్లిదండ్రులు అసంతప్తిని వ్యక్తం చేశారు. కనీసం పట్టా తీసుకునేందుకు విద్యార్థులకు అవకాశం లేకుండా పోయిందని, గోల్డ్‌ మెడల్స్‌ తీసుకున్న వారికి ముఖ్య అతిథులతో ఫొటో దిగే అవకాశం ఇవ్వలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బ్యాచ్‌ విద్యార్థులకు క్యాంపస్‌ ఆవరణలోనే ఏటా చేస్తే బాగుంటుందని పలువురు పేర్కొన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 12:50 AM