కరోనా టెన్షన్
ABN , Publish Date - May 24 , 2025 | 01:24 AM
కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
నగరంలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ
కేజీహెచ్‌లో 40 పడకలు, విమ్స్‌లో 20 పడకలతో ప్రత్యేక వార్డులు ఏర్పాటు
అనుమానిత లక్షణాలు ఉన్నవారికి అర్బన్ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు
ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్న వైద్యులు
విశాఖపట్నం, మే 23 (ఆంధ్రజ్యోతి):
కరోనా వైరస్ మళ్లీ వ్యాప్తి చెందుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఆరోగ్య శాఖ ఆదేశాలతో జిల్లా అధికారులు కేజీహెచ్, విమ్స్‌లలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటుచేశారు. కేజీహెచ్ క్యాజువాల్టీ మొదటి అంతస్థులో 20 పడకలతో వార్డును సిద్ధం చేశారు. పాత బ్లడ్ బ్యాంకుపై మరో 20 పడకలతో వార్డు ఏర్పాటుచేయనున్నారు. అలాగే కరోనా వైరస్ లక్షణాలతో వచ్చే వారికి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విమ్స్‌లో కూడా 20 పడకలతో ఐసోలేషన్ వార్డును ఏర్పాటుచేశారు. అవసరాన్ని బట్టి షిఫ్టుల వారీగా పనిచేయాల్సి ఉంటుందని వైద్యులకు, నర్సింగ్ సిబ్బందికి ఇప్పటికే సమాచారాన్ని ఇచ్చారు.
కరోనా లక్షణాలతో బాధపడే వారికి నగర పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్స్‌తోపాటు ప్రాథ మిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షలు నిర్వ హించనున్నారు. ఇందుకోసం 50 చొప్పున కిట్స్‌ను అందిస్తున్నట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు వెల్లడించారు. ర్యాపిడ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిన వారికి కేజీహెచ్‌లో ఆర్‌టీపీసీఆర్ పరీక్ష నిర్వహించ నున్నారు.
కొవిడ్‌లో కొత్త వేరియంట్
కరోనా వైరస్ విభిన్న రకాలుగా మార్పు చెందుతూ వస్తోంది. ఒక్కోసారి ఒక్కో రకమైన వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియంట్ 2023లో అమెరికా, యూరప్‌లలో కేసుల నమోదుకు కారణమైన ఒమిక్రాన్ రకానికి చెందినదిగా వైద్యులు చెబు తున్నారు. ఒమిక్రాన్ మార్పులు చెంది 30 మ్యుటేషన్లుగా విస్తరించింది. ఇందులో ప్రస్తుతం జేఎన్ 1 వేరియంట్‌కు చెందిన ఎల్‌ఎఫ్ 7, ఎన్‌బీ 1.8 వ్యాప్తి చెందుతున్నట్టు చెబుతున్నారు. ఈ రెండు వేరియంట్‌ల వల్ల దేశంలో ఇప్పటివరకూ 257 కేసులు నమోదైనట్టు అధికారులు గుర్తించారు.
ఇవీ లక్షణాలు..
ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న వేరియంట్‌కు సంబంధించిన వైరస్ సోకిన వారిలో దగ్గు, గొంతునొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, నీరసం, నిస్సత్తువ, కొందరికి కండ్ల కలక వంటి లక్షణాలు మూడు నుంచి వారం రోజుల పాటు ఉంటున్నట్టు చెబుతున్నారు. లక్షణాలను బట్టి మందులు అందిస్తారు. నగరానికి చెందిన 28 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- డాక్టర్ కె.రాంబాబు, విమ్స్ డైరెక్టర్, కరోనా వైరస్ నోడల్ అధికారి
కరోనా వైరస్ గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో వారం కంటే ఎక్కువ రోజులు బాధ పడుతుంటే అలసత్వం ప్రదర్శించవద్దు. వైద్యు లను సంప్రతించి పరీక్షలు చేయించు కోవాలి. విమ్స్‌లో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశాం. పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన ర్యాపిడ్ కిట్స్ కూడా సిద్ధం చేశాం. ప్రస్తుతం కొవిడ్ వైరస్ వేరియంట్ ఎక్కువగా ముంబై, కేరళల్లో వ్యాప్తి చెందుతోంది. గతంలో కూడా మొదట ఆయా ప్రాంతాల్లోనే కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.