Share News

సమన్వయంతో గంజాయి కట్టడి

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:54 AM

సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే జిల్లా మీదుగా గంజాయి రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ తుహిన్‌ సిన్హాతో కలిసి జిల్లా నార్కో కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కమిటీలో ఉన్న అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కళాశాలల అధ్యాపకులు, వసతిగృహాల వార్డెన్లతో ‘ఈగల్‌’ క్లబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

సమన్వయంతో గంజాయి కట్టడి
పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హా, వివిధ శాఖల అధికారులు

విద్యా సంస్థల్లో ‘ఈగల్‌’ క్లబ్‌లు

గంజాయిపై సమాచారానికి 1972 టోల్‌ఫ్రీ నంబర్‌

కలెక్టర్‌ విజయకృష్ణన్‌

అనకాపల్లి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తే జిల్లా మీదుగా గంజాయి రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టవచ్చని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎస్పీ తుహిన్‌ సిన్హాతో కలిసి జిల్లా నార్కో కో-ఆర్డినేషన్‌ సెంటర్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కమిటీలో ఉన్న అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, కళాశాలల అధ్యాపకులు, వసతిగృహాల వార్డెన్లతో ‘ఈగల్‌’ క్లబ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. విద్యా సంస్థల వద్ద ప్రత్యేక నిఘా పెట్టాలని చెప్పారు. గంజాయి వినియోగం, అమ్మకాలు జరుగుతున్నట్టు సమాచారం తెలిస్తే టోల్‌ఫ్రీ నంబరు 1972 కు సమాచారం అందించాలన్నారు. ఎస్పీ తుహిన్‌ సిన్హా మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి నిరోధానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏజెన్సీ నుంచి జిల్లాలోకి ప్రవేశించే తాటిపర్తి, కోనాం, డౌనూరు, భీమవరం, శ్రీరాంపురంలో శాశ్వత చెక్‌పోస్టులు, 38 పాయింట్లలో వాహన తనిఖీలు నిరంతరాయంగా జరగుతున్నాయని తెలిపారు. గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి విద్యా సంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో 15 పడకలతో డీఅడిక్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 42 కేసుల్లో 178 మంది గంజాయి నిందితులను గుర్తించామని, వీరిలో 138 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. అనంతరం 1972 టోల్‌ఫ్రీ నంబరుపై విస్తృత ప్రచారం నిర్వహించేందుకు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ దేవప్రసాద్‌, ఆర్డీఓలు షేక్‌ ఆయీషా, వీవీ రమణ, డ్రగ్‌ కంట్రోల్‌ ఏడీ విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:54 AM