Share News

సింహాచలం దేవస్థానంలో ప్రధాన అర్చకత్వంపై వివాదం

ABN , Publish Date - Nov 25 , 2025 | 01:15 AM

సింహాచలం దేవస్థానంలో ప్రధాన అర్చక పోస్టుపై మూడేళ్లుగా వివాదం నడుస్తోంది.

సింహాచలం దేవస్థానంలో ప్రధాన అర్చకత్వంపై వివాదం

నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు కల్పించారంటూ హైకోర్టును ఆశ్రయించిన ఇన్‌చార్జి ప్రధాన అర్చకుడు

నిబంధనల ప్రకారం చేయాలని న్యాయస్థానం ఆదేశం

రెండు నెలలైనా చర్యలు చేపట్టని ఇక్కడి అధికారులు

దేవదాయ శాఖ కమిషనర్‌ లేఖ రాసినా బేఖాతరు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహాచలం దేవస్థానంలో ప్రధాన అర్చక పోస్టుపై మూడేళ్లుగా వివాదం నడుస్తోంది. దీనిపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని దేవస్థానం అధికారులు అమలు చేయడం లేదు. తాజాగా దేవదాయ శాఖ కమిషనర్‌ లేఖ రాసినా సరే ఇక్కడి అధికారుల్లో చలనం లేదు. ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని తెలిసినా పట్టనట్టు ఉంటున్నారు. దీని వెనుక ఆలయంలో కొన్ని దశాబ్దాలుగా పాతుకపోయిన ఒక ఏఈఓ హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకుల పోస్టు కోసం 2022లో సీనియారిటీ జాబితా రూపొందించారు. ఉప ప్రధాన అర్చకులుగా ఉండేవారికి అవకాశం కల్పించడం ఆనవాయితీ. అప్పటికే ఇన్‌చార్జి ప్రధాన అర్చక పోస్టులో కేకే శ్రీనివాస ప్రసాదాచార్యులు పనిచేస్తున్నారు. ఆయన్ను కాదని ఉప ప్రధాన అర్చకులుగా ఉన్న గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఐవీ రమణాచార్యులకు పదోన్నతి కల్పించారు. దీనిపై ఇన్‌చార్జి ప్రధాన అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. అందులో ఆయన కొన్ని అంశాలు ప్రస్తావించారు. గొడవర్తి శ్రీనివాసాచార్యులు 2001 నుంచి 2009 వరకు విదేశాలకు వెళ్లి అక్కడ అర్చకత్వం ఉద్యోగాలు చేశారని పేర్కొన్నారు. దానికి సెలవులు ఇచ్చినట్టు సర్వీసు రికార్డులో నమోదైందని కోర్టుకు సమర్పించారు. ఆ తరువాత కూడా పలుమార్లు ఆయన విదేశీయానం చేశారని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ధార్మిక పరిషత్‌ సర్క్యులర్‌ 2010 ప్రకారం విదేశీ యానం చేసిన వారు గర్భగుడిలో అర్చక విధులు నిర్వహించకూడదని, ఈ విషయం తెలిసి కూడా నాటి దేవస్థానం ఈఓ పదోన్నతి కల్పించారని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఇదిలావుండగా ఈ కేసులో రెండో ప్రధాన అర్చకులైన రమణాచార్యులు కొద్దినెలల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. దాంతో ఇప్పుడు కేసు ప్రధానంగా గొడవర్తి శ్రీనివాసాచార్యులపైనే నడుస్తోంది.

అభ్యంతరాలు వ్యక్తంచేసినా

సీనియారిటీ జాబితా తయారు చేస్తున్నప్పుడే తాను ఈ అభ్యంతరాలన్నీ ఆలయ ఈఓ దృష్టికి తీసుకువెళ్లానని, కానీ పట్టించుకోలేదని శ్రీనివాస ప్రసాదాచార్యులు ఆరోపిస్తున్నారు. తనను అదే ఇన్‌చార్జి ప్రధాన అర్చక పోస్టులో ఉంచేసి, ఉప ప్రధాన అర్చకులు ఇద్దరికీ ప్రధాన అర్చకులుగా పదోన్నతులు కల్పిస్తూ 2022 సెప్టెంబరు 18న ఆదేశాలు ఇచ్చి, అమలు చేశారని పేర్కొన్నారు. దీనిపై న్యాయం చేయాలని హైకోర్టును కోరగా, ఆయన చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకొని నిబంధనల ప్రకారం నిర్దేశిత సమయంలోగా చర్యలు తీసుకోవాలని 2025 సెప్టెంబరు 18న ఆదేశాలు ఇచ్చింది. దీనిని దేవస్థానం ఈఓ ఇప్పటివరకూ అమలు చేయలేదు. దాంతో బాధిత అర్చకులు ఈ నెల 5వ తేదీన దేవదాయ శాఖ కమిషనర్‌ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లారు. కమిషనర్‌ రామచంద్రమోహన్‌ వెంటనే దానిపై చర్యలు తీసుకొని తనకు నివేదిక పంపాలని ఈఓ సుజాతను ఆదేశిస్తూ ఈ నెల 18న ఉత్తర్వులు పంపించారు. ఇప్పటివరకూ వాటిని అధికారులు ముట్టుకోలేదు.

అక్కడ అన్నీ ఆయనే

దేవస్థానంలో ఏఈఓ ఒకరు కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. ఆయనకు శారదాపీఠం స్వామి ఆశీస్సులు ఉన్నాయి. అక్కడ ఆయన చెప్పిందే వేదం. గతంలో సాక్షాత్తూ దేవదాయ శాఖ మంత్రే ఆయన్ను సమీక్షా సమావేశంలో తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పుడు ఈ ఉత్తర్వులు అమలు చేయకుండా అడ్డం పడుతున్నది ఆయనేనని దేవస్థానం వర్గాల వాదన. ప్రస్తుతం ఇన్‌చార్జి ఈఓగా ఉన్న డిప్యూటీ కమిషనర్‌ సుజాత దీనిపై ఇంకా దృష్టి సారించలేదు. ఈ అంశంపై వివరణ కోరేందుకు యత్నించగా ఆమె స్పందించలేదు.

Updated Date - Nov 25 , 2025 | 01:15 AM